Shani Shingnapur
-
ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు సాధించారు
ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు గొప్ప విజయం సాధించారు. తమకు శని షిగ్నాపూర్లోని శని ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహిళలు శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళ భక్తులు వరుసకట్టారు. గత చాలాకాలంగా మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద పోరాటం కూడా జరిగి కోర్టు దాకా వెళ్లింది. ఈ అంశంపై స్పందించిన ముంబయి కోర్టు స్త్రీలు, పురుషులు సమానమేనని, ఆలయ ప్రవేశాల విషయంలో వివక్ష చూపరాదని పేర్కొన్న నేపథ్యంలో ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. కానీ, గుడి పడ్వా(మహారాష్ట్రలో ఉగాది పండుగ పేరు) సందర్భంగా వందమంది పురుషులు ట్రస్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్తా బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈరోజు మహిళలకు కూడా అనుమతినిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. -
ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఆలయాల్లోకి ప్రవేశం మాత్రం లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆధునిక మహిళలు. సుప్రసిద్ధ ఆలయాల్లోకి తాము వెళ్లకుండా అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శబరిమల, శని సింగనాపూర్ ఆలయాల్లోని ప్రవేశించకుండా తమపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తున్నారు. మగాళ్లతో సమానంగా తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని పోరాడుతున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పడతులు ప్రయత్నం చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సనాతన వాదులు ఈ చర్యను తప్పుబడుతున్నారు. ఆచార వ్యవహారాలను మంటగలుపుతూ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వందలాది ఏళ్లుగా నిష్టగా ఆచరిస్తున్న ఆచారాలను ఉల్లంఘించడానికి తాము సిద్దంగా లేమని శని సింగనాపూర్ ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్టతలు, పద్ధతులు ఉంటాయని వాటిని పాటించాలని అంటున్నారు. ఆలయంలో కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని సింగనాపూర్ ఆలయ బోర్డు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనితా సేథే చెప్పడం గమనార్హం. సమాన హక్కుల కోసం పోరాడుతుంటే తమపై నిందలు వేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దేవుడి ముందు అంతా సమానమే అయినప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారు. పౌర హక్కులు, మత స్వేచ్చను హరించేందుకు ఎవరికీ హక్కు లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని క్లాజ్ 20(బీ) ఆర్టికల్ 25 మతస్వేచ్ఛ ను కాపాడాలని చెబుతోందని గుర్తు చేస్తున్నారు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి తమను అనుమతించాలని తాజాగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, తమపై నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని వారంటున్నారు. ఈ వివాదంపై అనుకూల, ప్రతికూల వాదనలతో సోషల్ మీడియాలో వాడివేడీగా చర్చలు నడుస్తున్నాయి. రైట్ టు ప్రే, రైట్ టు వర్షిప్ హాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. పురుషులను అనుమతించని ఒక్క హిందూ దేవాలయం కూడా లేదు, మరి మహిళలకు ఆంక్షలు ఎందుకుని కిరణ్ బేడీ ట్వీటర్ లో ప్రశ్నించారు. లక్ష్మి, దుర్గ, సరస్వతి దేవతలను శక్తి, సిరిసంపదలు, చదువుల కోసం పూజించే ఆచారమున్న దేశంలో మహిళలపై వివక్ష ఎలా చూపుతారని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. అయితే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సూచించారు. తమపై విధించిన ఆంక్షల సంకెళ్లను తెంచడానికి ఇంకెంత కాలం పోరాటం చేయాలని మహిళా లోకం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి. -
'హెలికాప్టర్లో వెళ్లైనా ఆ గుడిలోకి ప్రవేశిస్తాం'
అహ్మద్‌నగర్: మహిళలకు ప్రవేశం నిరాకరిస్తున్న మహారాష్ట్రలోని శని దేవాలయంలోకి తాము ఎట్టిపరిస్థితుల్లో వెళ్లితీరుతామని ఓ మహిళా హక్కుల సంఘం హెచ్చరించింది. ముంబైకి 330 కిలోమీటర్ల దూరంలో షిగ్నాపూర్లో ఉన్న ప్రముఖ దేవాలయమైన శని ఆలయంలోని గర్భగుడిలోకి గత ఆరు దశాబ్దాలుగా మహిళలను అనుమతించడం లేదు. ఇది మహిళల పట్ల వివక్ష చూపడమేనని, రాజ్యాంగ ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంటూ భూమాత రణరాగిణి బ్రిగేడ్ (బీఆర్బీ) కార్యకర్తలు దాదాపు 400 మంది ఆలయంలోని ప్రవేశించాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నపక్షంలో అవసరమైతే హెలికాప్టర్లో ప్రయాణించైనా ఆలయానికి చేరుకుంటామని, హెలికాప్టర్ నుంచి నిచ్చెనలు వేసుకొని ఆలయంలోకి దిగుతామని బీఆర్బీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 'మేం ఇప్పటికే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం. భూమార్గంలో మాకు ప్రవేశాన్ని నిరాకరిస్తే.. మేం చాపర్ ద్వారా నిచ్చెనలు వేసి ఆలయంలో దిగుతాం. మహిళలకు హక్కులకు సంబంధించిన ఈ విషయంలో మేం దేనికి భయపడేది లేదు' అని బీఆర్బీ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. మరోవైపు షిగ్నాపూర్ గ్రామస్తులు మహిళా కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. మానవహారంగా ఏర్పడి అయినా వారిని అడ్డుకుంటామని స్థానికులు చెప్తున్నారు. దీంతో షిగ్నాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. -
తాళాల్లేవు... నమ్మకముంది!
దైవాదీనం: బయట గార్డు ఉంటాడు.. బ్యాంకు తాళాలేసి ఉంటాయి.. లోపల స్ట్రాంగ్ రూంకు ఇంకో తాళమేసి ఉంటుంది.. అందులో హైలెవెల్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య డబ్బు, బంగారం దాచి ఉంటాయి.. అయినా ఆ డబ్బు, బంగారం పోదని గ్యారెంటీ లేదు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా బ్యాంకు దొంగతనాలు ఆగని రోజులివి! అలాంటిది అసలు తాళాలే వేయకుండా, తలుపులే మూయకుండా ఓ బ్యాంకు నడపడం సాధ్యమా? లోపలున్న కోట్ల రూపాయల డబ్బు భద్రంగా ఉంటుందా? ఈ ఆలోచన అసలు ఊహకైనా అందుతుందా? కానీ మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఈ అద్భుతమే చోటు చేసుకుంది. అక్కడ తాళాల్లేని, తలుపులే మూయని బ్యాంకు మొదలైంది. ఇదెలా సాధ్యమైంది? ఈ బ్యాంకు కథేంటి? శని శింగనాపూర్.. పేరును బట్టే ఈ ఊరి కథేంటో చెప్పేయచ్చు. శనీశ్వరుడి ఆలయానికి ప్రసిద్ధి ఈ ఊరు. అహ్మద్‌నగర్ జిల్లాలో మూడు వేల జనాభాతో ఉన్న ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయముంది. తమ గ్రామాన్ని శనీశ్వరుడే పాలిస్తాడని.. ఆయనే తమకు రక్ష అని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఎవరైనా తప్పు చేస్తే శని ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి.. తిష్టవేసుకుని కూర్చుంటాడని.. అతనికి ఎప్పటికీ కష్టాలే అన్నది వారి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆ గ్రామంలో ఏ ఇంటికీ తాళాలు వెయ్యరు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగతున్న సంప్రదాయం. ఎలాంటి స్థితిలోనైనా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు మూయడం, తాళాలు వేయడమన్నది జరగదు. ఐతే శని శింగనాపూర్‌లో ఎప్పుడూ దొంగతనాలు లేకుండా ఏమీ లేదు. 2010లో ఓసారి, తర్వాతి ఏడాది మరోసారి రెండు దొంగతనాలు జరిగాయి. అవి మినహాయిస్తే మరే కేసులూ లేవు. గత మూడేళ్ల కాలంలో చిన్న దొంగతనం కూడా జరగలేదు. శని శింగనాపూర్‌లో తాళాలేయని సంప్రదాయం కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ దుకాణాలు, కార్యాలయాలు, గుళ్లు, పాఠశాలలు కూడా తాళాల్లేకుండానే పని చేస్తున్నాయి. తాళాలేయమన్న షరతులతోనే ఇక్కడ దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. ఐతే వీటి సంగతి బాగానే ఉంది కానీ.. కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే బ్యాంకుల సంగతేంటి మరి! శని శింగనాపూర్ గ్రామ సంప్రదాయం గురించి తెలియక ఇక్కడ బ్రాంచి తెరుద్దామని చూశాయి చాలా బ్యాంకులు. కానీ బ్యాంకుకు తాళాలేస్తే ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు గ్రామస్థులు. తాళాల్లేకుండా బ్యాంకు తెరవడానికి ససేమిరా అన్నారు అధికారులు. దీంతో బ్యాంకుల ద్వారా కలిగే ప్రయోజనాలేవీ అందక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు శని శింగనాపూర్ గ్రామస్థులు. ఐతే శంకర్ గడఖ్ అనే ఎన్సీపీ నేత ప్రయత్నంతో ఓ ముందడుగు పడింది. ఆయన యూకో బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఊరి సంప్రదాయం గురించి చెప్పి, గ్రామస్థులే బ్యాంకును కాపాడుకుంటారని హామీ ఇచ్చారు. ప్రతి బ్యాంకుకూ హై సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పక్కనబెట్టి మరీ యూకో బ్యాంకు శని శింగనాపూర్ తన బ్రాంచి ఆరంభించింది. గ్రామస్థుల కోరిక ప్రకారమే తాళాలేయకుండా బ్యాంకు లావాదేవీలు నడపడానికి అంగీకరించింది. ఈ ఏడాది జనవరిలో మొదలైన శని శింగనాపూర్ యూకో బ్యాంకు బ్రాంచి ఏ ఇబ్బందులూ లేకుండా నడిచిపోతోంది. ఐతే ప్రధాన ద్వారానికి తాళాలు వేయనప్పటికీ.. నగదు, బంగారం ఇతరత్రా ముఖ్యమైన వస్తువులన్నింటినీ కొంచెం భద్రమైన చోటులోనే ఉంచి లావాదేవీలు సాగిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిలో కొందరు ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేసుకోగా.. గ్రామస్థులు సైతం బ్యాంకుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్థానిక పోలీసులు, అధికారులు బ్యాంకు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఇబ్బందులూ లేకుండా బ్యాంకు కార్యకలాపాలు సాగిపోతున్నాయి. శని శింగనాపూర్‌లోని శనీశ్వరుడి ఆలయానికి రోజూ దాదాపు పది వేల మంది భక్తులు వస్తారు. వారాంతాల్లో ఆ సంఖ్య 50 వేల దాకా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది కూడా. ఇంతమంది వస్తూ పోతున్నా ఇక్కడి జనాలు ధైర్యంగా తలుపులు, తాళాలు వేయకుండా జీవనం సాగిస్తుండటం విశేషం. అందులోనూ ఓ బ్యాంకు తాళాలే లేకుండా తన కార్యకలాపాలు సాఫీగా సాగిస్తుండటం ఇంకా పెద్ద విశేషం.