ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు సాధించారు
ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు గొప్ప విజయం సాధించారు. తమకు శని షిగ్నాపూర్లోని శని ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహిళలు శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళ భక్తులు వరుసకట్టారు.
గత చాలాకాలంగా మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద పోరాటం కూడా జరిగి కోర్టు దాకా వెళ్లింది. ఈ అంశంపై స్పందించిన ముంబయి కోర్టు స్త్రీలు, పురుషులు సమానమేనని, ఆలయ ప్రవేశాల విషయంలో వివక్ష చూపరాదని పేర్కొన్న నేపథ్యంలో ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు.
కానీ, గుడి పడ్వా(మహారాష్ట్రలో ఉగాది పండుగ పేరు) సందర్భంగా వందమంది పురుషులు ట్రస్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్తా బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈరోజు మహిళలకు కూడా అనుమతినిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.