Entry Ban
-
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..!
జెరూసలేం: కోవిడ్ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కాబినెట్ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్-ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఐతే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్ లేబుల్ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుండి వచ్చే ఇజ్రాయెలీయులను కూడా క్యారంటైన్లో ఉండాలని తెల్పింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటికే కొత్తవేరియంట్ తాలూకు కేసులు యూకే, యూరోపియన్ దేశాలలో వెలుగుచూసిన సంగతి తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతిని అరికట్టడానికి అనేక దేశాలు అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అదేబాటను ఇజ్రాయెల్ దేశం కూడా అనుసరిస్తోంది. -
ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు సాధించారు
ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు గొప్ప విజయం సాధించారు. తమకు శని షిగ్నాపూర్లోని శని ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహిళలు శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళ భక్తులు వరుసకట్టారు. గత చాలాకాలంగా మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద పోరాటం కూడా జరిగి కోర్టు దాకా వెళ్లింది. ఈ అంశంపై స్పందించిన ముంబయి కోర్టు స్త్రీలు, పురుషులు సమానమేనని, ఆలయ ప్రవేశాల విషయంలో వివక్ష చూపరాదని పేర్కొన్న నేపథ్యంలో ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. కానీ, గుడి పడ్వా(మహారాష్ట్రలో ఉగాది పండుగ పేరు) సందర్భంగా వందమంది పురుషులు ట్రస్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్తా బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈరోజు మహిళలకు కూడా అనుమతినిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. -
ఆ దర్గాలో మహిళల రాకపై నిషేధం కొనసాగింపు!
ముంబై: హజి అలీ దర్గా పరమ పవిత్ర గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించకుండా విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకొనే విషయంలో బొంబాయి హైకోర్టు నిగ్రహం పాటించింది. దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ 'ఈ రోజున్న వాతావరణంలో ప్రతి అంశాన్ని మరో అర్థం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇది అసహన యుగం. మత విషయాల్లో ప్రజలు మరీ సున్నితంగా మారిపోయారు' అని పేర్కొంది. దక్షిణ ముంబైలోని వర్లీలో హజి అలీ దర్గా నెలకొని ఉంది. ఈ దర్గాలో 15వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు హజి అలీ సమాధి ఉంది. ఈ దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలపై ఉన్న నిషేధం విషయంలో వివాదాన్ని పరిష్కరించాలని, నిబంధనలను మార్చే విషయమై పునరాలోచించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు దర్గా ట్రస్టులకు సూచించింది. ఈ మేరకు సమావేశమైన దర్గా ట్రస్టీలు మహిళలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో వాదనలను హైకోర్టు డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.