హజి అలీ దర్గా పరమ పవిత్ర గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించకుండా విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకొనే విషయంలో బొంబాయి హైకోర్టు నిగ్రహం పాటించింది.
ముంబై: హజి అలీ దర్గా పరమ పవిత్ర గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించకుండా విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకొనే విషయంలో బొంబాయి హైకోర్టు నిగ్రహం పాటించింది. దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ 'ఈ రోజున్న వాతావరణంలో ప్రతి అంశాన్ని మరో అర్థం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇది అసహన యుగం. మత విషయాల్లో ప్రజలు మరీ సున్నితంగా మారిపోయారు' అని పేర్కొంది.
దక్షిణ ముంబైలోని వర్లీలో హజి అలీ దర్గా నెలకొని ఉంది. ఈ దర్గాలో 15వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు హజి అలీ సమాధి ఉంది. ఈ దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలపై ఉన్న నిషేధం విషయంలో వివాదాన్ని పరిష్కరించాలని, నిబంధనలను మార్చే విషయమై పునరాలోచించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు దర్గా ట్రస్టులకు సూచించింది. ఈ మేరకు సమావేశమైన దర్గా ట్రస్టీలు మహిళలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో వాదనలను హైకోర్టు డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.