Haji Ali Dargah
-
‘ఆ మహిళల మైండ్‌సెట్ మారాలి’
ముంబై: నగరంలోని హజీ అలీ దర్గాలోకి వెళ్లి సూఫీ ముస్లిం గురువు సమాధిని సందర్శించుకునేందుకు మహిళలకు కూడా హక్కుందని ముంబై హైకోర్టు శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పు పట్ల మహిళల స్పందనలు భిన్నంగా ఉన్నాయి. ఇతర మతాల మహిళలు దీన్ని ఎక్కువగా హర్షిస్తూ వారు దీన్ని మహిళల విజయంగా పేర్కొంటుండగా, ముస్లిం మహిళల్లోనే ఎక్కువ మంది భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని, తాము మాత్రం గర్భగుడి, సూఫీ సమాధి వద్దకు వెళ్లమని, ఎప్పటిలాగే దూరం నుంచి దర్శించుకొని పోతామని చెబుతున్నారు. 600 సంవత్సరాల క్రితానికి చెందిన సూఫీ గురువు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి సమాధిని దర్శించుకునేందుకు 2011 సంవత్సరం వరకు దర్గా నిర్వాహకులు మహిళలను లోపలికి అనుమతించారు. అప్పటి వరకు అనుమతించిన వారు ఎందుకు హఠాత్తుగా మహిళలపై నిషేధం విధించారు? అప్పటి వరకు ఎలాంటి సందేహం లేకుండా సూఫీ సమాధిని సందర్శించుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు ఎందుకు సమాధి వద్దకు వెళ్లడానికి సందేహిస్తున్నారు? వారి వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడైనా మహిళల మైండ్‌సెట్ మారాలని మహిళల నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ‘కోర్టు తీర్పు ఆసక్తిదాయకంగానే ఉంది. ఇతర మహిళలు దర్గా లోపలికి వెళితే వెళ్లనీయండి. ముస్లిం మహిళలు లోపలికి వెళ్లకుండా దూరం నుంచే సమాధిని సందర్శించుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం’ అని శుక్రవారం దర్గాను సందర్శించిన 30 ఏళ్ల ఇల్లాలు నసీం బానో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము దర్గా లోపలికి వెళ్లం. అది మగవాళ్ల హక్కు మాత్రమే’ అని షరీఫ్ పఠాన్ అనే మరో మహిళ వ్యాఖ్యానించారు. అడవాళ్లకు రుతుస్రావం లాంటి సమస్యలుంటాయి కనుక దర్గా లోపలికి వెళ్లకపోవడమే మంచిదని పఠాన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఉందే సమస్యల కారణంగానే కేరళలోని శబరిమళ ఆలయంలోకి, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదనే విషయం తెల్సిందే. ముస్లిం ఏతర మహిళలు మాత్రం ఇది మహిళల గొప్ప విజయమని అభివర్ణిస్తున్నారు. ముంబై హైకోర్టు తీర్పు వెలువడిన రోజునే తాను దర్గాకు రావడం తన అదృష్టమని ఢిల్లీ నుంచి వచ్చిన భక్తురాలు మృణాలిని మెహతా లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే తీర్పు వెలువడిన వెంటనే దర్గాలోని సమాధిని సందర్శించే అవకాశం మాత్రం ఇంకా మహిళలకు దక్కలేదు. దర్గా నిర్వాహకులు తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసిన విషయం తెల్సిందే. -
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే..
-
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే.. ఆపై స్టే
-
దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే.. ఆపై స్టే
ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని బాంబే హైకోర్టు అనుమతించింది. కానీ కాసేపటికే.. తన తీర్పు మీద ఆరు వారాల స్టే విధించింది. పురుషులతో పాటే మహిళలను కూడా దర్గలోకి అనుమతించొచ్చని, మహారాష్ట్ర ప్రభుత్వం వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దర్గాలోకి మహిళలను ప్రవేశించనివ్వడం లేదంటూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌కు చెందిన నూర్జహాన్ నియాజ్, జకియా సోమన్ అనే మహిళలు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఖురాన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తమకున్న హక్కులను ఇన్నాళ్లకు పునరుద్ధరించారని జకియా హర్షం వ్యక్తం చేశారు. 2012 కంటే ముందు దర్గాలోకి మహిళలను అనుమతించేవారని పిటిషనర్లు వాదించారు. హజీ అలీ దర్గా మహిళలను లోపలకు ప్రవేశించనివ్వకపోవడం సరికాదని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు తెలిపింది. ప్రార్థనలు చేసే హక్కు పురుషులకు, మహిళలకు సమానంగా ఉండాలని చెప్పింది. కాగా హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్లు హజీ అలీ ట్రస్టు తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో అందుకు అనుకూలంగా స్పందించిన హైకోర్టు, తామిచ్చిన తీర్పు అమలుపై ఆరు వారాల స్టే విధించింది. దర్గా లోపలి ప్రాంతం బాగా రద్దీగా ఉంటుందని, అందువల్ల అక్కడ మహిళలకు భద్రత ఉండదని దర్గా తరఫు న్యాయవది వాదించారు. షరియత్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు తీర్పు ఇచ్చినట్లుందని, ఈ చట్టంలో మహిళలకు కొన్ని హద్దులు ఉన్నాయని దర్గాకు చెందిన మౌలానా సాజిద్ రషీదీ తెలిపారు. ఈ విషయాల్లో కలగజేసుకోడానికి ముందు వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇదంతా ఒక రాజకీయ క్రీడ అయిపోయిందని అన్నారు. -
దర్గాలోకి వస్తే రంగు పడుద్ది!
ముంబైలోని హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. భూమాత రణరాగిణి బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్‌పై నల్లసిరా చల్లుతామని ఏఐఎంఐఎం హెచ్చరించింది. హజీ ఆలి దర్గాలోని లోపలి చాంబర్లోకి మహిళల ప్రవేశం నిషేధం. అయితే, దీనిని ధిక్కరిస్తూ.. గురువారం తమ మహిళ కార్యకర్తలతో కలిసి హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తామని తృప్తి దేశాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తృప్తి దేశాయ్ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బలవంతంగా ఆమె హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. ఆమెపై మేం నల్ల సిరా చల్లుతాం' అని ఎంఐఎం మహారాష్ట్ర నేత హజీ రఫత్ స్పష్టం చేశారు. ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం వివక్ష చూపడమేనంటూ తృప్తి దేశాయ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హజీ ఆలి దర్గా జంక్షన్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆమె నేతృత్వంలోని బిగ్రేడ్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ దర్గాలో మహిళలకూ ప్రార్థనల్లో సమాన అవకాశాలు కల్పించాలని తృప్తి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్గా పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృప్తి ప్రకటనను వ్యతిరేకిస్తూ శివసేన నేత హజి ఆరాఫత్ ఇప్పటికే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. -
'అక్కడికెళ్తే నిన్ను చెప్పులతో కొడతారు'
ముంబై : మహిళా హక్కుల కార్యకర్త, భూమాత రణరాగిణి బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించి శివసేన ముస్లిం నాయకుడు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం ముంబైలోని హజీ ఆలి దర్గాలోని ప్రవేశిస్తే.. ఆమెను చెప్పులతో తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. 'హజీ ఆలి దర్గాలోకి ప్రవేశించి మజార్‌ను తాకుతామని తృప్తి దేశాయ్ చెప్తోంది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆమెకు చెప్పులతో స్వాగతం తప్పదు' అని శివసేన నాయకుడు హజి ఆరాఫత్ షైక్ తెలిపారు. 2014లో ఎమ్మెన్నెస్ నుంచి శివసేనలో చేరిన షైక్ మాట్లాడుతూ 'నా మతం తరఫున నేను గళమెత్తుతాను. మజార్‌ను తాకేందుకు ఆమెను అనుమతించను. ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు' అని చెప్పారు. హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తి దేశాయ్ ఇటీవల హజీ ఆలి దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించింది. స్త్రీలకు ప్రవేశం లేని ఈ దర్గాలో మహిళలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తామని ఆమె తెలిపింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన షైక్.. దర్గాలోకి ప్రవేశించాలన్న తృప్తి ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని, ముంబైలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. మరోవైపు ఈ నెల 28న హజీ ఆలి దర్గాలోకి తాము ప్రవేశించి తీరుతామని, శివసేన బెదిరింపులకు తలొగ్గబోమని తృప్తి దేశాయ్ స్పష్టం చేస్తున్నారు. -
హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం!
ముంబై: ముంబైలో ప్రసిద్ధ హజీ అలీ దర్గాలోని పవిత్ర ప్రాంతంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలన్న వాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఖురాన్ ప్రకారం నిషేధం మతవిశ్వాసాలకు సంబంధించినదిగా దర్గా బోర్డు నిరూపించగలిగేంతవరకూ ప్రవేశం కల్పించడానికి తమకు అభ్యంతరం లేదంది. ఈమేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టుకు విన్నవించారు. హజీ అలీ ట్రస్ట్ దర్గాలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టు ఆదేశం మేరకు ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. విచారణ చేపట్టిన కోర్టు ... ఈ నెల 3న ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దర్గాలో పురుష మతపెద్ద సమాధి ఉందని, ఇస్లాం ప్రకారం మహిళలు పురుష మతపెద్దలను తాకరాదని దర్గా బోర్డు వాదించింది. అయితే, హజీ అలీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ దర్గాలో ఎవరినీ ఖననం చేయలేదని పిటిషనర్ రాజు మోరే కోర్టు దృష్టికి తెచ్చారు. -
ఇప్పుడిక ముస్లిం మహిళల పోరుబాట
న్యూఢిల్లీ: తాము శనిఆలయంలోకి ప్రవేశించి తీరుతామని శనిశింగాపూర్లో పలువురు మహిళలు ఇప్పటికే ఉద్యమిస్తుండగా.. అదే బాటలో ముస్లిం మహిళలు కదిలారు. తమను దర్గాలోకి అనుమతించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి తమకు ప్రవేశ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జీనత్ షాకత్ అలీ అనే ముస్లిం మహిళ మాట్లాడుతూ తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, మతపరమైన పరిమితులు తమకు లేవని చెప్పారు. తమకు నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాజ్యాంగం తమకు అన్ని హక్కులను ఇచ్చిందని, ఇస్లాం రాజ్యాంగాన్ని అంగీకరిస్తుందని తెలిపారు. 'నేను ఒక ముస్లింనే, దర్గాల్లోకి, స్మశానాల్లోకి ప్రవేశించకూడదని ఇస్లాం మతంలో ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ పితృస్వామ్య నియంతృత్వ పోకడలు' అని ఆమె ఆరోపించారు. ఇటు ముస్లింలలో, అటు హిందువులలో వారి ఆధిపత్యమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ దర్గాలో మహిళల రాకపై నిషేధం కొనసాగింపు!
ముంబై: హజి అలీ దర్గా పరమ పవిత్ర గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించకుండా విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకొనే విషయంలో బొంబాయి హైకోర్టు నిగ్రహం పాటించింది. దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ 'ఈ రోజున్న వాతావరణంలో ప్రతి అంశాన్ని మరో అర్థం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇది అసహన యుగం. మత విషయాల్లో ప్రజలు మరీ సున్నితంగా మారిపోయారు' అని పేర్కొంది. దక్షిణ ముంబైలోని వర్లీలో హజి అలీ దర్గా నెలకొని ఉంది. ఈ దర్గాలో 15వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు హజి అలీ సమాధి ఉంది. ఈ దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలపై ఉన్న నిషేధం విషయంలో వివాదాన్ని పరిష్కరించాలని, నిబంధనలను మార్చే విషయమై పునరాలోచించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు దర్గా ట్రస్టులకు సూచించింది. ఈ మేరకు సమావేశమైన దర్గా ట్రస్టీలు మహిళలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో వాదనలను హైకోర్టు డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. -
‘హాజీఅలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలి’
సాక్షి, ముంబై: ప్రముఖ హాజీ అలీ దర్గాలోకి మహిళలను నిషేధించాలని హాజీ అలీ దర్గా ట్రస్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్ సంఘటన హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని సంఘటన తెలిపింది. గతంలో ఈ దర్గా లోపలివరకు మహిళలను అనుమతించేవారు. షరియత్ నియమ, నిబంధనల ప్రకారం వారిని నిషేధించాలని కొద్ది రోజుల కిందట నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు స్పష్టం చేసింది. అయితే సంఘటన సభ్యులు నగరంలో ఉన్న 19 దర్గాలను అధ్యయనం చేయగా అందులో 12 చోట్ల మహిళలను లోపలికి అనుమతిస్తున్నట్లు వెల్లడైంది. హాజీ దర్గాలో మహిళ, పురుషులనే భేదాలెందుకుని భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్ సంఘటన ప్రశ్నించింది. రాష్ట్ర మహిళ కమిషన్, రాష్ట్ర మైనార్టీ కమిషన్, దేవాదాయ శాఖ కమిషనర్ ఇలా వివిధ శాఖలను సంప్రదించినప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంఘటన తెలిపింది.