దర్గాలోకి మహిళల ప్రవేశం ఓకే.. ఆపై స్టే
ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని బాంబే హైకోర్టు అనుమతించింది. కానీ కాసేపటికే.. తన తీర్పు మీద ఆరు వారాల స్టే విధించింది. పురుషులతో పాటే మహిళలను కూడా దర్గలోకి అనుమతించొచ్చని, మహారాష్ట్ర ప్రభుత్వం వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. దర్గాలోకి మహిళలను ప్రవేశించనివ్వడం లేదంటూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌కు చెందిన నూర్జహాన్ నియాజ్, జకియా సోమన్ అనే మహిళలు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఖురాన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తమకున్న హక్కులను ఇన్నాళ్లకు పునరుద్ధరించారని జకియా హర్షం వ్యక్తం చేశారు.
2012 కంటే ముందు దర్గాలోకి మహిళలను అనుమతించేవారని పిటిషనర్లు వాదించారు. హజీ అలీ దర్గా మహిళలను లోపలకు ప్రవేశించనివ్వకపోవడం సరికాదని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు తెలిపింది. ప్రార్థనలు చేసే హక్కు పురుషులకు, మహిళలకు సమానంగా ఉండాలని చెప్పింది.
కాగా హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్లు హజీ అలీ ట్రస్టు తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో అందుకు అనుకూలంగా స్పందించిన హైకోర్టు, తామిచ్చిన తీర్పు అమలుపై ఆరు వారాల స్టే విధించింది. దర్గా లోపలి ప్రాంతం బాగా రద్దీగా ఉంటుందని, అందువల్ల అక్కడ మహిళలకు భద్రత ఉండదని దర్గా తరఫు న్యాయవది వాదించారు. షరియత్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు తీర్పు ఇచ్చినట్లుందని, ఈ చట్టంలో మహిళలకు కొన్ని హద్దులు ఉన్నాయని దర్గాకు చెందిన మౌలానా సాజిద్ రషీదీ తెలిపారు. ఈ విషయాల్లో కలగజేసుకోడానికి ముందు వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇదంతా ఒక రాజకీయ క్రీడ అయిపోయిందని అన్నారు.