దర్గాలోకి వస్తే రంగు పడుద్ది!
ముంబైలోని హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. భూమాత రణరాగిణి బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్‌పై నల్లసిరా చల్లుతామని ఏఐఎంఐఎం హెచ్చరించింది. హజీ ఆలి దర్గాలోని లోపలి చాంబర్‌లోకి మహిళల ప్రవేశం నిషేధం. అయితే, దీనిని ధిక్కరిస్తూ.. గురువారం తమ మహిళ కార్యకర్తలతో కలిసి హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తామని తృప్తి దేశాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తృప్తి దేశాయ్ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బలవంతంగా ఆమె హజీ ఆలి దర్గాలోకి ప్రవేశిస్తే.. ఆమెపై మేం నల్ల సిరా చల్లుతాం' అని ఎంఐఎం మహారాష్ట్ర నేత హజీ రఫత్ స్పష్టం చేశారు.
ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం వివక్ష చూపడమేనంటూ తృప్తి దేశాయ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హజీ ఆలి దర్గా జంక్షన్ వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆమె నేతృత్వంలోని బిగ్రేడ్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ దర్గాలో మహిళలకూ ప్రార్థనల్లో సమాన అవకాశాలు కల్పించాలని తృప్తి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్గా పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృప్తి ప్రకటనను వ్యతిరేకిస్తూ శివసేన నేత హజి ఆరాఫత్ ఇప్పటికే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.