'అక్కడికెళ్తే నిన్ను చెప్పులతో కొడతారు'
ముంబై : మహిళా హక్కుల కార్యకర్త, భూమాత రణరాగిణి బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించి శివసేన ముస్లిం నాయకుడు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం ముంబైలోని హజీ ఆలి దర్గాలోని ప్రవేశిస్తే.. ఆమెను చెప్పులతో తరిమికొడతారని ఆయన హెచ్చరించారు.
'హజీ ఆలి దర్గాలోకి ప్రవేశించి మజార్‌ను తాకుతామని తృప్తి దేశాయ్ చెప్తోంది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆమెకు చెప్పులతో స్వాగతం తప్పదు' అని శివసేన నాయకుడు హజి ఆరాఫత్ షైక్ తెలిపారు. 2014లో ఎమ్మెన్నెస్ నుంచి శివసేనలో చేరిన షైక్ మాట్లాడుతూ 'నా మతం తరఫున నేను గళమెత్తుతాను. మజార్‌ను తాకేందుకు ఆమెను అనుమతించను. ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు' అని చెప్పారు.
హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తి దేశాయ్ ఇటీవల హజీ ఆలి దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని ప్రకటించింది. స్త్రీలకు ప్రవేశం లేని ఈ దర్గాలో మహిళలతో కలిసి ప్రార్థనలు నిర్వహిస్తామని ఆమె తెలిపింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన షైక్.. దర్గాలోకి ప్రవేశించాలన్న తృప్తి ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని, ముంబైలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. మరోవైపు ఈ నెల 28న హజీ ఆలి దర్గాలోకి తాము ప్రవేశించి తీరుతామని, శివసేన బెదిరింపులకు తలొగ్గబోమని తృప్తి దేశాయ్ స్పష్టం చేస్తున్నారు.