నేరస్తుల వివరాలు ఇవ్వండి
- సెంట్రల్, పశ్చిమ రైల్వే పరిపాలన విభాగాన్ని
- ఆదేశించిన హైకోర్టు
సాక్షి, ముంబై: మహిళలు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎంతమంది నేరస్తులను పట్టుకున్నారో వివరాలు అందజేయాలని బాంబే హైకోర్టు సెంట్రల్, పశ్చిమ రైల్వే పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, అందులో రికార్డయిన వీడియో పుటేజ్‌లను భద్ర పరచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రైల్వే పరిపాలన విభాగం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహిళ ప్రయాణికుల కోసం రైల్వే పరిపాలన విభాగం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం పోలీసులను భర్తీ చేయడం, కోట్లు వెచ్చించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయినప్పటికీ మహిళ ప్రయాణికులపై నేరాలు, చోరీలు, దోపిడీలు తగ్గలేదు. దీంతో కోర్టులో దాఖలైన ప్రజా వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు నరేశ్ పాటిల్, ఎస్.బి.శుక్రే ల బెంచి సెంట్రల్, పశ్చిమ రైల్వే లాయర్లను విచారించింది. 600 మంది పోలీసులను భర్తీ చేశారని, ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తున్నట్లు రైల్వే తరఫు న్యాయవాది చెప్పారు. లోకల్ రైలు మహిళ బోగీలు, ప్లాట్‌ఫారంలు, స్టేషన్ పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర సమయంలో సాయం కోసం అన్ని లోకల్ రైలు బోగీలలో హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే హైల్ప్‌లైన్‌కు అందిన ఫిర్యాదుల సంఖ్య, పరిష్కరించిన ఫిర్యాదులు, సీసీటీవీ కెమెరాలతో పట్టుకున్న నేరస్తుల సంఖ్య, దొంగతనం, దోపిడీలో రాబట్టుకున్న సొమ్ము వివరాలు అఫిడవిట్ ద్వారా సమర్పించాలని న్యాయమూర్తుల బెంచి ఆదేశించింది.