ఆలయంలోకి అనుమతించకపోవడంతో బైఠాయించి ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్‌లో అధికారులు వారిని అడ్డుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్‌కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు.
మోరిగావ్‌లో పాదయాత్రకు అనుమతి లేదు
సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్‌లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్‌సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment