కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ్ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోం ముఖ్యమంత్రిపైనా రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్‌కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా.. ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు.
సోమవారం ఉదయం బటాద్రవ థాన్(సత్రం) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక నేతలు, కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన.
మరోవైపు.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నాం 3.గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెబుతున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ.
బటాద్రవ థాన్ ఆలయం 15వ శతాబ్దపు సన్యాసి.. అసోం సంఘసంస్కర్త అయిన శ్రీమంత శంకర్‌దేవ్‌కు జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బటాద్రవ థాన్‌కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో.. ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని.. ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని.. రూట్ మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్‌ని కోరారు.
మరోవైపు అసోంలో.. ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment