
దిస్‌పూర్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. అసోం ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నాం రాహుల్ యాత్ర సాగిందన్నది అసోం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా.. జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టారు. అలాగే.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని అసోం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ మేరకు జోడో న్యాయ్ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపైనా కేసు నమోదు అయ్యింది. అంతకు ముందు..
అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆరో రోజుకి చేరింది. ఇవాళ అతిపెద్ద మంచి నీటి ద్వీపం మజూలీలో రాహుల్ యాత్ర సాగనుంది. జనవరి 25వ తేదీ దాకా రాహుల్ అసోంలోనే యాత్రలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment