Shani Shingnapur temple
-
‘శని’ గుడికొస్తే రేప్‌లు పెరుగుతాయి
మహిళలకు అనుమతి వల్లే కేరళ విషాదం: స్వరూపానంద డెహ్రాడూన్: మహిళలు మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోకి వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీని వల్ల స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతాయని ద్వారక-శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు గుడిలోకి ప్రవేశం పొందడాన్ని విజయంగా భావించకూడదని ఆదివారం హరిద్వార్‌లో అన్నారు. ఆడవారు ఈ విజయంతో పొంగిపోకుండా, మగవారితో మత్తుపదార్థాల వాడకాన్ని మాన్పించాలని, వాటివల్లే పురుషులు స్త్రీలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్‌లో ప్రమాదం జరిగిందన్నారు. మహారాష్ట్రలో కరువుకు కారణం సాయిబాబా విగ్రహాలను ఆలయాల్లో ప్రతిష్ఠించి గణేశ్, హనుమంతులను బాబా కాళ్ల దగ్గర ఉంచడమేనని చెప్పారు. కాగా త్రయంబకేశ్వరంలో గర్భగుడిలోకి పురుషులను అనుమతించకూడదని ఏప్రిల్ 3న తీసుకున్న నిర్ణయాన్ని ఆలయాధికారులు ఎత్తివేశారు. -
ఆ మహిళల వల్లే కేరళ ప్రమాదం?
హరిద్వార్: ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి కేరళ పుట్టుంగళ్ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శని శింగనాపూర్ ఆలయంలోని మహిళలు ప్రవేశించడం వల్లే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనదైన శైలిలో వాదనలు వినిపించారు. నాలుగు శతాబ్దాల సంప్రదాయాన్ని కాలదన్ని మహిళలు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడం వల్లే పుట్టుంగళ్ అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. షిర్డీ సాయిబాబాకు ప్రజలు చేస్తున్న పూజలు ఫలితంగా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళుగా సాయిబాబా, శని అనర్హులని, వారి పూజల కారణంగానే మహారాష్ట్రలో జల సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు . మహిళలు, సాయిబాబాను, శని దేవుడిని పూజించకూడదని స్వరూపానంద తేల్చి చెప్పారు. అటు శంకరాచార్య సంచలన వ్యాఖ్యలపై హేతువాద సంఘాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఆయన చేస్తున్న వితండ వాదనలు మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టినట్టుగా ఉన్నాయని విమర్శించాయి. విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితమైనవని కొట్టి పారేశారు. -
‘శని’ గుళ్లోకి మహిళలకు ప్రవేశం
నిషేధాన్ని ఎత్తివేస్తూ శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు నిర్ణయం సాక్షి, ముంబై: వివాదాస్పద శని శింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. మహారాష్ట్రీయుల కొత్త సంవ త్సరం ‘గుడి పాడ్వా’ కానుకగా ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ట్రస్టు సభ్యులు.. బాంబే హైకోర్టు ఆదేశాల్ని అనుసరిస్తూ అందరినీ శనిదేవుడ్ని కొలిచేందుకు అనుమతించాలని నిర్ణయించారు. నిర్ణయం అనంతరం తృప్తిదేశాయ్ ఆధ్వర్యంలో భూమాతా బ్రిగేడ్ సభ్యులు శనిదేవునికి పూజలు చేశారు. కోర్టు ఆదేశాలను పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్టీ సాయారాం బన్కర్ చెప్పారు.ఇక నుంచి ఎలాంటి వివ క్షా ఉండదని.. శుక్రవారమే అందరి కోసం గుడి తలుపులు తెరిచి ఉంచామని ఆలయ ప్రతినిధి హరిదాస్ గేవాలే తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యకమైంది. దశాబ్దాల కట్టుబాట్లకు ముగింపు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శని శింగ్నాపూర్లోకి మహిళల్ని అనుమతించాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దశాబ్దాల కట్టుబాట్లను బద్దలుకొడుతూ గతేడాది నవంబరులో శనిదేవునికి ఓ మహిళ తైలాభిషేకం చేసింది. ఈ సంఘటన అనంతరం అనేక సంఘాలు ముందుకొచ్చి మహిళలకు ప్రవేశంపై పోరాటం చేశాయి. ‘భూమాతా రణరాగిని బ్రిగేడ్’ ఆధ్వర్యంలో తృప్తి దేశాయ్(32) మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఆలయంలోకి వెళ్లేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. దేవుడ్ని పూజించేందుకు మహిళల్ని అనుమతించాలని, శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశం కల్పించాలంటూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 1న ఆదేశించింది. ఆందోళన నేపథ్యంలో పురుషులకు కూడా మండపంపైన ఉండే శని శిలకు తైలాభిషేకాన్ని ట్రస్టు నిషేధించింది. ఈ విషయంలో గ్రామస్తులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. కొందరు పురుషులు శనిదేవుని శిలకు జలాభిషేకం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఆలయ ట్రస్ట్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాలు, మహిళా సంఘాల నిరసనలపై సుదీర్ఘంగా చర్చించి ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. లింగవివక్ష వద్దని ముందునుంచి చెబుతున్నామని సీఎం ఫడ్నవిస్ అన్నారు. ఎట్టకేలకు శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఆనందం కలిగించింది: తృప్తి దేశాయి కొంత ఆలస్యమైనా ఆలయ ట్రస్టు నిర్ణయం ఆనందం కలిగించిందని భూమాతా బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ అన్నారు. ఇదో చారిత్రాత్మకమైన రోజని, ఈ నిర్ణయం దేశంలో లింగ సమానత్వానికి దోహదపడుతుందన్నారు. -
దైవ సాక్షిగా...
సమాజంలో అందరికీ సమానావకాశాలు దక్కాలని, ఏ రూపంలోనూ వివక్ష ఉండ రాదని మన రాజ్యాంగం చెబుతున్నా ఏదో ఒక స్థాయిలో అది కొనసాగుతూనే ఉంది. మిగిలిన వివక్షలను గుర్తించినంత సులభంగా లింగ వివక్షను గుర్తించడం, దాన్ని పారదోలడం కష్టం. అందులోనూ ఆ వివక్ష కుటుంబ విలువల పేరిట... మత విశ్వాసాలు లేదా నమ్మకాల పేరిట అమలులో ఉంటే దానితో వ్యవహరిం చడం మరింత కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని శనిసింగనా పూర్లో ఉన్న శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించరాదన్న 400 ఏళ్లనాటి నిబంధనను తొలగిస్తున్నట్టు ఆ ఆలయ ట్రస్టు శుక్రవారం చేసిన ప్రకటన చాలామందికి ఊరటనిస్తుంది. అయితే ఈ మార్పు అంత సులభంగా రాలేదు. మహిళల విషయంలో వివక్ష చూపుతున్న ఆ నిబంధనను నిరసిస్తూ, ‘ప్రార్ధించే హక్కు’ కల్పించాలని కోరుతూ గత ఆరేడు నెలలుగా భూమాత రణ రంగిని బ్రిగేడ్(బీఆర్బీ) ఆధ్వర్యాన ఉద్యమం సాగుతోంది. ఆలయప్రవేశానికి వారు చేసిన ప్రయత్నాలను గతంలో పోలీసులు వమ్ము చేశారు. ఆలయ ప్రవేశంలో ఎలాంటి వివక్షా పాటించరాదని 1956 నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థలాల చట్టం చెబుతుండగా...అందుకు విరుద్ధమైన పోకడలపై ఎందుకు చర్య తీసుకోరని బొంబాయి హైకోర్టు చీవాట్లు పెట్టాక మహారాష్ట్ర సర్కారు అయిష్టంగానే అయినా కాస్త కదిలింది. కానీ ఆ తీర్పు వచ్చిన మర్నాడు శనీశ్వరాలయంలోని వేదికపైకి వెళ్లబోయిన మహిళలను కొందరు స్థానికులు అడ్డుకోవడమేకాక బీఆర్బీ నాయకు రాలు తృప్తి దేశాయ్‌పై దాడిచేశారు. వివక్షాపూరిత నిబంధనను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ట్రస్టు ప్రకటించిన వెంటనే మహిళలు ఆలయంలో పూజలు చేశారు. అసలు ఒక సకలాతీత శక్తి ఉందా, లేదా అనేది వేరే చర్చ. అలాంటి శక్తి ఉన్నదని నమ్మేవారి విషయంలో వివక్ష అమలు కావడమేమిటన్నదే కీలక ప్రశ్న. నిజానికి ఈ ప్రాతిపదికనే 15 సంవత్సరాలక్రితం హేతువాది నరేంద్ర దభోల్కర్ (ఆయనను రెండేళ్లక్రితం కొందరు దుండగులు కాల్చిచంపారు.)ఆధ్వర్యంలో శనిసింగనాపూర్‌కు తొలిసారి పాదయాత్ర సాగింది. మహిళలపై వివక్ష చూపరా దంటూ ఆయన 2011లో బొంబాయి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మన రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని చెబు తోంది. 15వ అధికరణ అన్ని రకాల వివక్షనూ నిషేధించింది. 25వ అధికరణ ఏ మతాన్నయినా అనుసరించే స్వేచ్ఛనిస్తున్నది. శనిసింగనాపూర్లో ఈ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని లక్ష్మీశాస్త్రి అనే మహిళ నిరుడు డిసెంబర్లో సుప్రీం కోర్టుకు ఫిర్యాదుచేశారు. అంతకు నెలరోజులక్రితం ఒక మహిళ బారికేడ్లను దాటు కుని శని దేవత కొలువై ఉన్న వేదికనెక్కితే ఆ వేదిక మైలపడిందని భావించి అక్కడి పూజారులు సంప్రోక్షణ చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి పోకడలు వెగటు పుట్టించడమే కాదు...సమాజంలో దురభిప్రాయాలను వ్యాప్తిచేస్తాయి. సమాజంపై మత విశ్వాసాలు, ఆచారాల ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక దశలో, ఎవరి ప్రయోజనం కోసమో ఏర్పరిచిన నిబంధన కాలక్రమేణా ఆచారంగా మారి అమలవుతుంటే...అది ఆ మతాభిప్రాయంగా చలామణి అవుతుంటే అందు వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. పురాతనకాలంనుంచీ అమలులో ఉన్నది గనుక దాన్ని పాటించితీరాలని, లేనట్టయితే అరిష్టం జరుగుతుందని బెదరగొట్టే వారు బయల్దేరతారు. మహిళలు ‘తక్కువ స్థాయివారు’ గనుకే కొన్ని ఆలయాల్లో వారికి ప్రవేశం ఉండదన్న అపోహను కొనసాగనిస్తే... అది సమాజంలో అనేక రకాల వివక్షకు తోవలు పరుస్తుంది. వాటన్నిటికీ సాధికారత కలగజేస్తుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై 2,000 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని అయిదేళ్లకిందట ఎంతో ఆందోళన జరిగాక తొలగించారు. ఆ రాష్ట్రంలోనే ఉన్న త్రయంబకేశ్వర్ గర్భాల యంలో కూడా మహిళల అనుమతిపై ఆంక్షలున్నాయి. వివక్ష కూడదన్న బొంబాయి హైకోర్టు ఆదేశాల తర్వాత ఈమధ్యే ఆ ఆలయం పురుషుల ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించి మరో రూపంలో ‘సమానత్వాన్ని’ పాటించడం మొదలెట్టింది. శబరిమల ఆలయంలో 10-50 సంవత్సరాల మధ్యనున్న ఆడవాళ్లు అయ్యప్ప స్వామి దర్శనానికి రాకూడదన్న ఆంక్షలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్నప్పుడు ఆ ఆలయ ప్రధాన అర్చకుడు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. రుతుక్రమ సమయంలో మహిళలు ‘స్వచ్ఛంగా’ ఉండరు గనుకే ఇలాంటి సంప్రదాయం అమలవుతున్నదని ఆయన చెప్పారు. అంతేకాదు... రుతుక్రమాన్ని కనిపెట్టే యంత్రం అందుబాటులోకొస్తే మహిళల ఆలయ ప్రవేశానికి అంగీకరిస్తానన్నారు. సహజంగానే ఈ వ్యాఖ్యలు అందరిలోనూ ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. కుల, మత,వర్గాలకు అతీతంగా అంద రినీ దర్శనానికి అనుమతించే అయ్యప్పస్వామి ఆలయంలో కేవలం మహిళల విష యంలో మాత్రమే ఈ వివక్ష ఎందుకన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈమధ్యే తీసుకొచ్చిన నిబంధనపై కూడా ఉద్యమం సాగుతోంది. ముస్లిమేతరులను దర్గాలోకి అనుమతిస్తూ స్వీయ మతంలోని మహిళలపై ఆంక్షలేమిటన్నదే ఆ ఉద్యమం సంధిస్తున్న ప్రశ్న. ఈ చరాచర ప్రపంచం సర్వమూ భగవంతుని సృష్టే అని నమ్మినప్పుడు వివక్ష పాటించడం అర్ధంలేని విషయం. ఆచారాలైనా, సంప్రదాయాలైనా మనం ఏర్పరుచుకున్నవే. అవి సమాజంలో కొందరిని హీనంగా చూస్తున్నాయని, బాధిస్తున్నాయని గ్రహించినప్పుడు వాటిని సవరించుకోవడమే విజ్ఞత అనిపించుకుంటుంది. ఆలస్యంగానైనా అలాంటి విజ్ఞత ప్రదర్శించినందుకు శనీశ్వరాలయ ట్రస్టును అభినందించాలి. ఇతర ప్రార్థనాలయాలకు సైతం ఇది ఆదర్శంకావాలి. -
ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు సాధించారు
ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు గొప్ప విజయం సాధించారు. తమకు శని షిగ్నాపూర్లోని శని ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహిళలు శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళ భక్తులు వరుసకట్టారు. గత చాలాకాలంగా మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద పోరాటం కూడా జరిగి కోర్టు దాకా వెళ్లింది. ఈ అంశంపై స్పందించిన ముంబయి కోర్టు స్త్రీలు, పురుషులు సమానమేనని, ఆలయ ప్రవేశాల విషయంలో వివక్ష చూపరాదని పేర్కొన్న నేపథ్యంలో ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. కానీ, గుడి పడ్వా(మహారాష్ట్రలో ఉగాది పండుగ పేరు) సందర్భంగా వందమంది పురుషులు ట్రస్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్తా బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈరోజు మహిళలకు కూడా అనుమతినిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. -
'శని' అంటే ఇష్టం: దేశాయ్
అహ్మద్ నగర్: తాను పబ్లిసిటీ కోసం పాకులాడడం లేదని భూమాత రణరాగిని బ్రిగేడ్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని ఆమె స్పష్టం చేశారు. శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుతించాలని పోరాటం చేస్తూ ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో సంప్రదాయవాదులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆమె వెనుక రాజకీయ పార్టీలున్నాయని ఆరోపణలు చేశారు. అయితే వీటన్నింటినీ ఆమె కొట్టిపారేశారు. వివక్షకు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో స్పష్టం చేశారు. తాను రైట్ వింగ్ చెందిన దాన్ని కాదని, లెఫ్ట్ వింగ్ కార్యకర్తను కూడా కాదని అన్నారు. తాను శని దేవుడి భక్తురాలిననని చెప్పుకొచ్చారు. ఆలయ ట్రస్టు మహిళలను గౌరవించాలన్నదే ఉద్దేశమని 26 ఏళ్ల తృప్తి దేశాయ్ చెప్పారు. బాలిక ప్రవేశించిందన్న కారణంతో శని ఆలయాన్ని శుద్ది చేయడం తమను కలచివేసిందని, అప్పుడే తమ పోరాటానికి బీజం పడిందని వెల్లడించారు. 400 ఏళ్లుగా మహిళలపై కొనసాగుతున్న వివక్షకు తెర దించాలన్న లక్ష్యంతో పోరాటం ప్రారంభించామని అన్నారు. తృప్తి దేశాయ్ కు పోరాటాలు కొత్త కాదు. తన బ్యాంకు ఖాతా స్తంభింపజేయడంతో 2009లో తొలిసారిగా ఆమె ఆందోళనకు దిగారు. తనతో పాటు పలువురి బ్యాంకు ఖాతాలను తిరిగి తెరిపించారు. అన్నా హజారే లోక్ పాల్ బిల్లుకు మద్దతుగా పుణెలో ర్యాలీలు నిర్వహించారు. బాబా రాందేవ్ చేపట్టిన నల్లధనం వ్యతిరేక ఉద్యమానికి బాసటగా నిలిచారు. చెరుకు రైతుల హక్కుల కోసం ఉద్యమించారు. అయితే తీరిక సమయాల్లో తన ఆరేళ్ల కుమారుడు యోగిరాజ్ తో గడుపుతుంటానని తృప్తి దేశాయ్ తెలిపారు. పుణెలో 2010లో స్థాపించిన భూమాత బ్రిగేడ్ సంస్థకు మహారాష్ట్రలోని 21 ప్రాంతాల్లో 4500 మంది సభ్యులున్నారు. -
'ఆలయంలోకి మహిళలను అనుమతించండి'
ముంబయి: వివాదంగా మారిన శని షింగాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించాలని ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఈ ఆలయ ప్రధాన అర్చకులు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఇవ్వాలనే డిమాండ్వైపే మొగ్గు చూపుతానని చెప్పారు. అయితే, ఈ విషయంపై ఇప్పటికీ ఆలయ ట్రస్టీలకు, ఉద్యమకారులకు సమాభిప్రాయం లేకుండా పోయిందని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు చేస్తున్న ప్రతిపాదన తమకు ఆమోద యోగ్యం కాదని ఉద్యమకారురాలు తృప్తి దేశాయ్ అన్నారు.