ఆ మహిళల వల్లే కేరళ ప్రమాదం?
హరిద్వార్: ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి కేరళ పుట్టుంగళ్ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శని శింగనాపూర్ ఆలయంలోని మహిళలు ప్రవేశించడం వల్లే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనదైన శైలిలో వాదనలు వినిపించారు.
నాలుగు శతాబ్దాల సంప్రదాయాన్ని కాలదన్ని మహిళలు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడం వల్లే పుట్టుంగళ్ అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. షిర్డీ సాయిబాబాకు ప్రజలు చేస్తున్న పూజలు ఫలితంగా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళుగా సాయిబాబా, శని అనర్హులని, వారి పూజల కారణంగానే మహారాష్ట్రలో జల సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు . మహిళలు, సాయిబాబాను, శని దేవుడిని పూజించకూడదని స్వరూపానంద తేల్చి చెప్పారు.
అటు శంకరాచార్య సంచలన వ్యాఖ్యలపై హేతువాద సంఘాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఆయన చేస్తున్న వితండ వాదనలు మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టినట్టుగా ఉన్నాయని విమర్శించాయి. విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితమైనవని కొట్టి పారేశారు.