Shankaracharya Swaroopanand Saraswati
-
'బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు'
అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. సాయి భక్తుల నిరసన ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు. -
‘శని’ గుడికొస్తే రేప్‌లు పెరుగుతాయి
మహిళలకు అనుమతి వల్లే కేరళ విషాదం: స్వరూపానంద డెహ్రాడూన్: మహిళలు మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోకి వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీని వల్ల స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతాయని ద్వారక-శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు గుడిలోకి ప్రవేశం పొందడాన్ని విజయంగా భావించకూడదని ఆదివారం హరిద్వార్‌లో అన్నారు. ఆడవారు ఈ విజయంతో పొంగిపోకుండా, మగవారితో మత్తుపదార్థాల వాడకాన్ని మాన్పించాలని, వాటివల్లే పురుషులు స్త్రీలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్‌లో ప్రమాదం జరిగిందన్నారు. మహారాష్ట్రలో కరువుకు కారణం సాయిబాబా విగ్రహాలను ఆలయాల్లో ప్రతిష్ఠించి గణేశ్, హనుమంతులను బాబా కాళ్ల దగ్గర ఉంచడమేనని చెప్పారు. కాగా త్రయంబకేశ్వరంలో గర్భగుడిలోకి పురుషులను అనుమతించకూడదని ఏప్రిల్ 3న తీసుకున్న నిర్ణయాన్ని ఆలయాధికారులు ఎత్తివేశారు. -
ఆ మహిళల వల్లే కేరళ ప్రమాదం?
హరిద్వార్: ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి కేరళ పుట్టుంగళ్ ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శని శింగనాపూర్ ఆలయంలోని మహిళలు ప్రవేశించడం వల్లే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనదైన శైలిలో వాదనలు వినిపించారు. నాలుగు శతాబ్దాల సంప్రదాయాన్ని కాలదన్ని మహిళలు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడం వల్లే పుట్టుంగళ్ అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. షిర్డీ సాయిబాబాకు ప్రజలు చేస్తున్న పూజలు ఫలితంగా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళుగా సాయిబాబా, శని అనర్హులని, వారి పూజల కారణంగానే మహారాష్ట్రలో జల సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు . మహిళలు, సాయిబాబాను, శని దేవుడిని పూజించకూడదని స్వరూపానంద తేల్చి చెప్పారు. అటు శంకరాచార్య సంచలన వ్యాఖ్యలపై హేతువాద సంఘాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఆయన చేస్తున్న వితండ వాదనలు మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టినట్టుగా ఉన్నాయని విమర్శించాయి. విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితమైనవని కొట్టి పారేశారు.