దైవ సాక్షిగా... | women enter into Shani Shingnapur Temple | Sakshi
Sakshi News home page

దైవ సాక్షిగా...

Published Sat, Apr 9 2016 1:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

దైవ సాక్షిగా... - Sakshi

దైవ సాక్షిగా...

సమాజంలో అందరికీ సమానావకాశాలు దక్కాలని, ఏ రూపంలోనూ వివక్ష ఉండ రాదని మన రాజ్యాంగం చెబుతున్నా ఏదో ఒక స్థాయిలో అది కొనసాగుతూనే ఉంది. మిగిలిన వివక్షలను గుర్తించినంత సులభంగా లింగ వివక్షను గుర్తించడం, దాన్ని పారదోలడం కష్టం. అందులోనూ ఆ వివక్ష కుటుంబ విలువల పేరిట... మత విశ్వాసాలు లేదా నమ్మకాల పేరిట అమలులో ఉంటే దానితో వ్యవహరిం చడం మరింత కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని శనిసింగనా పూర్‌లో ఉన్న శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించరాదన్న 400 ఏళ్లనాటి నిబంధనను తొలగిస్తున్నట్టు ఆ ఆలయ ట్రస్టు శుక్రవారం చేసిన ప్రకటన చాలామందికి ఊరటనిస్తుంది. అయితే ఈ మార్పు అంత సులభంగా రాలేదు. మహిళల విషయంలో వివక్ష చూపుతున్న ఆ నిబంధనను నిరసిస్తూ, ‘ప్రార్ధించే హక్కు’ కల్పించాలని కోరుతూ గత ఆరేడు నెలలుగా భూమాత రణ రంగిని బ్రిగేడ్(బీఆర్‌బీ) ఆధ్వర్యాన ఉద్యమం సాగుతోంది.

ఆలయప్రవేశానికి వారు చేసిన ప్రయత్నాలను గతంలో పోలీసులు వమ్ము చేశారు. ఆలయ ప్రవేశంలో ఎలాంటి వివక్షా పాటించరాదని 1956 నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థలాల చట్టం చెబుతుండగా...అందుకు విరుద్ధమైన పోకడలపై ఎందుకు చర్య తీసుకోరని బొంబాయి హైకోర్టు చీవాట్లు పెట్టాక మహారాష్ట్ర సర్కారు అయిష్టంగానే అయినా కాస్త కదిలింది. కానీ ఆ తీర్పు వచ్చిన మర్నాడు శనీశ్వరాలయంలోని వేదికపైకి వెళ్లబోయిన మహిళలను కొందరు స్థానికులు అడ్డుకోవడమేకాక బీఆర్‌బీ నాయకు రాలు తృప్తి దేశాయ్‌పై దాడిచేశారు. వివక్షాపూరిత నిబంధనను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ట్రస్టు ప్రకటించిన వెంటనే మహిళలు ఆలయంలో పూజలు చేశారు.
 
అసలు ఒక సకలాతీత శక్తి ఉందా, లేదా అనేది వేరే చర్చ. అలాంటి శక్తి ఉన్నదని నమ్మేవారి విషయంలో వివక్ష అమలు కావడమేమిటన్నదే కీలక ప్రశ్న. నిజానికి ఈ ప్రాతిపదికనే 15 సంవత్సరాలక్రితం హేతువాది నరేంద్ర దభోల్కర్ (ఆయనను రెండేళ్లక్రితం కొందరు దుండగులు కాల్చిచంపారు.)ఆధ్వర్యంలో శనిసింగనాపూర్‌కు తొలిసారి పాదయాత్ర సాగింది. మహిళలపై వివక్ష చూపరా దంటూ ఆయన 2011లో బొంబాయి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మన రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని చెబు తోంది. 15వ అధికరణ అన్ని రకాల వివక్షనూ నిషేధించింది. 25వ అధికరణ ఏ మతాన్నయినా అనుసరించే స్వేచ్ఛనిస్తున్నది. శనిసింగనాపూర్‌లో ఈ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని లక్ష్మీశాస్త్రి అనే మహిళ నిరుడు డిసెంబర్‌లో సుప్రీం కోర్టుకు ఫిర్యాదుచేశారు. అంతకు నెలరోజులక్రితం ఒక మహిళ బారికేడ్లను దాటు కుని శని దేవత కొలువై ఉన్న వేదికనెక్కితే ఆ వేదిక మైలపడిందని భావించి అక్కడి పూజారులు సంప్రోక్షణ చేశారని ఆమె ఆరోపించారు.

ఇలాంటి పోకడలు వెగటు పుట్టించడమే కాదు...సమాజంలో దురభిప్రాయాలను వ్యాప్తిచేస్తాయి. సమాజంపై మత విశ్వాసాలు, ఆచారాల ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక దశలో, ఎవరి ప్రయోజనం కోసమో ఏర్పరిచిన నిబంధన కాలక్రమేణా ఆచారంగా మారి అమలవుతుంటే...అది ఆ మతాభిప్రాయంగా చలామణి అవుతుంటే అందు వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. పురాతనకాలంనుంచీ అమలులో ఉన్నది గనుక దాన్ని పాటించితీరాలని, లేనట్టయితే అరిష్టం జరుగుతుందని బెదరగొట్టే వారు బయల్దేరతారు. మహిళలు ‘తక్కువ స్థాయివారు’ గనుకే కొన్ని ఆలయాల్లో వారికి ప్రవేశం ఉండదన్న అపోహను కొనసాగనిస్తే... అది సమాజంలో అనేక రకాల వివక్షకు తోవలు పరుస్తుంది. వాటన్నిటికీ సాధికారత కలగజేస్తుంది.
 
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై 2,000 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని అయిదేళ్లకిందట ఎంతో ఆందోళన జరిగాక తొలగించారు. ఆ రాష్ట్రంలోనే ఉన్న త్రయంబకేశ్వర్ గర్భాల యంలో కూడా మహిళల అనుమతిపై ఆంక్షలున్నాయి. వివక్ష కూడదన్న బొంబాయి హైకోర్టు ఆదేశాల తర్వాత ఈమధ్యే ఆ ఆలయం పురుషుల ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించి మరో రూపంలో ‘సమానత్వాన్ని’ పాటించడం మొదలెట్టింది. శబరిమల ఆలయంలో 10-50 సంవత్సరాల మధ్యనున్న ఆడవాళ్లు అయ్యప్ప స్వామి దర్శనానికి రాకూడదన్న ఆంక్షలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్నప్పుడు ఆ ఆలయ ప్రధాన అర్చకుడు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.

రుతుక్రమ సమయంలో మహిళలు ‘స్వచ్ఛంగా’ ఉండరు గనుకే ఇలాంటి సంప్రదాయం అమలవుతున్నదని ఆయన చెప్పారు. అంతేకాదు... రుతుక్రమాన్ని కనిపెట్టే యంత్రం అందుబాటులోకొస్తే మహిళల ఆలయ ప్రవేశానికి అంగీకరిస్తానన్నారు. సహజంగానే ఈ వ్యాఖ్యలు అందరిలోనూ ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి. కుల, మత,వర్గాలకు అతీతంగా అంద రినీ దర్శనానికి అనుమతించే అయ్యప్పస్వామి ఆలయంలో కేవలం మహిళల విష యంలో మాత్రమే ఈ వివక్ష ఎందుకన్న ప్రశ్నకు సరైన జవాబు లేదు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈమధ్యే తీసుకొచ్చిన నిబంధనపై కూడా  ఉద్యమం సాగుతోంది. ముస్లిమేతరులను దర్గాలోకి అనుమతిస్తూ స్వీయ మతంలోని మహిళలపై ఆంక్షలేమిటన్నదే ఆ ఉద్యమం సంధిస్తున్న ప్రశ్న.
 
 ఈ చరాచర ప్రపంచం సర్వమూ భగవంతుని సృష్టే అని నమ్మినప్పుడు వివక్ష పాటించడం అర్ధంలేని విషయం. ఆచారాలైనా, సంప్రదాయాలైనా మనం ఏర్పరుచుకున్నవే. అవి సమాజంలో కొందరిని హీనంగా చూస్తున్నాయని, బాధిస్తున్నాయని గ్రహించినప్పుడు వాటిని సవరించుకోవడమే విజ్ఞత అనిపించుకుంటుంది. ఆలస్యంగానైనా అలాంటి విజ్ఞత ప్రదర్శించినందుకు శనీశ్వరాలయ ట్రస్టును అభినందించాలి. ఇతర ప్రార్థనాలయాలకు సైతం ఇది ఆదర్శంకావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement