‘శని’ గుళ్లోకి మహిళలకు ప్రవేశం
నిషేధాన్ని ఎత్తివేస్తూ శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు నిర్ణయం
సాక్షి, ముంబై: వివాదాస్పద శని శింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. మహారాష్ట్రీయుల కొత్త సంవ త్సరం ‘గుడి పాడ్వా’ కానుకగా ఆలయ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ట్రస్టు సభ్యులు.. బాంబే హైకోర్టు ఆదేశాల్ని అనుసరిస్తూ అందరినీ శనిదేవుడ్ని కొలిచేందుకు అనుమతించాలని నిర్ణయించారు. నిర్ణయం అనంతరం తృప్తిదేశాయ్ ఆధ్వర్యంలో భూమాతా బ్రిగేడ్ సభ్యులు శనిదేవునికి పూజలు చేశారు. కోర్టు ఆదేశాలను పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్టీ సాయారాం బన్కర్ చెప్పారు.ఇక నుంచి ఎలాంటి వివ క్షా ఉండదని.. శుక్రవారమే అందరి కోసం గుడి తలుపులు తెరిచి ఉంచామని ఆలయ ప్రతినిధి హరిదాస్ గేవాలే తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యకమైంది.
దశాబ్దాల కట్టుబాట్లకు ముగింపు
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శని శింగ్నాపూర్‌లోకి మహిళల్ని అనుమతించాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దశాబ్దాల కట్టుబాట్లను బద్దలుకొడుతూ గతేడాది నవంబరులో శనిదేవునికి ఓ మహిళ తైలాభిషేకం చేసింది. ఈ సంఘటన అనంతరం అనేక సంఘాలు ముందుకొచ్చి మహిళలకు ప్రవేశంపై పోరాటం చేశాయి. ‘భూమాతా రణరాగిని బ్రిగేడ్’ ఆధ్వర్యంలో తృప్తి దేశాయ్(32) మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఆలయంలోకి వెళ్లేందుకు అనేకసార్లు ప్రయత్నించారు.
దేవుడ్ని పూజించేందుకు మహిళల్ని అనుమతించాలని, శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశం కల్పించాలంటూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 1న ఆదేశించింది. ఆందోళన నేపథ్యంలో పురుషులకు కూడా మండపంపైన ఉండే శని శిలకు తైలాభిషేకాన్ని ట్రస్టు నిషేధించింది. ఈ విషయంలో గ్రామస్తులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య వివాదం ఏర్పడింది. కొందరు పురుషులు శనిదేవుని శిలకు జలాభిషేకం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఆలయ ట్రస్ట్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాలు, మహిళా సంఘాల నిరసనలపై సుదీర్ఘంగా చర్చించి ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
లింగవివక్ష వద్దని ముందునుంచి చెబుతున్నామని సీఎం ఫడ్నవిస్ అన్నారు. ఎట్టకేలకు శని శింగ్నాపూర్ ఆలయ ట్రస్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
ఆనందం కలిగించింది: తృప్తి దేశాయి
కొంత ఆలస్యమైనా ఆలయ ట్రస్టు నిర్ణయం ఆనందం కలిగించిందని భూమాతా బ్రిగేడ్ చీఫ్ తృప్తి దేశాయ్ అన్నారు. ఇదో చారిత్రాత్మకమైన రోజని, ఈ నిర్ణయం దేశంలో లింగ సమానత్వానికి దోహదపడుతుందన్నారు.