'శని' అంటే ఇష్టం: దేశాయ్
అహ్మద్ నగర్: తాను పబ్లిసిటీ కోసం పాకులాడడం లేదని భూమాత రణరాగిని బ్రిగేడ్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తెలిపారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని ఆమె స్పష్టం చేశారు. శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుతించాలని పోరాటం చేస్తూ ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో సంప్రదాయవాదులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆమె వెనుక రాజకీయ పార్టీలున్నాయని ఆరోపణలు చేశారు. అయితే వీటన్నింటినీ ఆమె కొట్టిపారేశారు.
వివక్షకు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో స్పష్టం చేశారు. తాను రైట్ వింగ్ చెందిన దాన్ని కాదని, లెఫ్ట్ వింగ్ కార్యకర్తను కూడా కాదని అన్నారు. తాను శని దేవుడి భక్తురాలిననని చెప్పుకొచ్చారు. ఆలయ ట్రస్టు మహిళలను గౌరవించాలన్నదే ఉద్దేశమని 26 ఏళ్ల తృప్తి దేశాయ్ చెప్పారు. బాలిక ప్రవేశించిందన్న కారణంతో శని ఆలయాన్ని శుద్ది చేయడం తమను కలచివేసిందని, అప్పుడే తమ పోరాటానికి బీజం పడిందని వెల్లడించారు. 400 ఏళ్లుగా మహిళలపై కొనసాగుతున్న వివక్షకు తెర దించాలన్న లక్ష్యంతో పోరాటం ప్రారంభించామని అన్నారు.
తృప్తి దేశాయ్ కు పోరాటాలు కొత్త కాదు. తన బ్యాంకు ఖాతా స్తంభింపజేయడంతో 2009లో తొలిసారిగా ఆమె ఆందోళనకు దిగారు. తనతో పాటు పలువురి బ్యాంకు ఖాతాలను తిరిగి తెరిపించారు. అన్నా హజారే లోక్ పాల్ బిల్లుకు మద్దతుగా పుణెలో ర్యాలీలు నిర్వహించారు. బాబా రాందేవ్ చేపట్టిన నల్లధనం వ్యతిరేక ఉద్యమానికి బాసటగా నిలిచారు. చెరుకు రైతుల హక్కుల కోసం ఉద్యమించారు. అయితే తీరిక సమయాల్లో తన ఆరేళ్ల కుమారుడు యోగిరాజ్ తో గడుపుతుంటానని తృప్తి దేశాయ్ తెలిపారు. పుణెలో 2010లో స్థాపించిన భూమాత బ్రిగేడ్ సంస్థకు మహారాష్ట్రలోని 21 ప్రాంతాల్లో 4500 మంది సభ్యులున్నారు.