'హెలికాప్టర్‌లో వెళ్లైనా ఆ గుడిలోకి ప్రవేశిస్తాం'
అహ్మద్‌నగర్: మహిళలకు ప్రవేశం నిరాకరిస్తున్న మహారాష్ట్రలోని శని దేవాలయంలోకి తాము ఎట్టిపరిస్థితుల్లో వెళ్లితీరుతామని ఓ మహిళా హక్కుల సంఘం హెచ్చరించింది. ముంబైకి 330 కిలోమీటర్ల దూరంలో షిగ్నాపూర్‌లో ఉన్న ప్రముఖ దేవాలయమైన శని ఆలయంలోని గర్భగుడిలోకి గత ఆరు దశాబ్దాలుగా మహిళలను అనుమతించడం లేదు. ఇది మహిళల పట్ల వివక్ష చూపడమేనని, రాజ్యాంగ ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంటూ భూమాత రణరాగిణి బ్రిగేడ్ (బీఆర్‌బీ) కార్యకర్తలు దాదాపు 400 మంది ఆలయంలోని ప్రవేశించాలని నిర్ణయించారు.
ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నపక్షంలో అవసరమైతే హెలికాప్టర్‌లో ప్రయాణించైనా ఆలయానికి చేరుకుంటామని, హెలికాప్టర్ నుంచి నిచ్చెనలు వేసుకొని ఆలయంలోకి దిగుతామని బీఆర్‌బీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 'మేం ఇప్పటికే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం. భూమార్గంలో మాకు ప్రవేశాన్ని నిరాకరిస్తే.. మేం చాపర్ ద్వారా నిచ్చెనలు వేసి ఆలయంలో దిగుతాం. మహిళలకు హక్కులకు సంబంధించిన ఈ విషయంలో మేం దేనికి భయపడేది లేదు' అని బీఆర్‌బీ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. మరోవైపు షిగ్నాపూర్ గ్రామస్తులు మహిళా కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. మానవహారంగా ఏర్పడి అయినా వారిని అడ్డుకుంటామని స్థానికులు చెప్తున్నారు. దీంతో షిగ్నాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.