శని ఆలయ ప్రవేశానికి మహిళల యత్నం
► అడ్డుకున్న పోలీసులు..
► మహిళా కార్యకర్తల నిరసన
► చర్చలతో సమస్యను
► పరిష్కరించుకోవాలన్న ‘మహా’ సీఎం
అహ్మద్‌నగర్: మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్‌లో ఉన్న శనిదేవునిఆలయచతురస్రాకార మండపంలోకి బలవంతంగా ప్రవేశించాలనుకున్న దాదాపు 400 మంది మహిళా సామాజిక కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు మంగళవారం ఆదిలోనే అడ్డుకున్నారు. చతురస్రాకార మండపంలోకి మహిళల ప్రవేశంపై 400 ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతున్న నిషేధానికి తెరదించేందుకు భూమాత బ్రిగేడ్ పేరిట బస్సుల్లో బయలుదేరిన కార్యకర్తలను ఆలయానికి 70కి.మీ. దూరంలోని సూపా గ్రామంలో మోహరించిన పోలీసులు నిలిపేశారు.
సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ను, ఇతర కార్యకర్తలను అదుపులోకి తీసుకొని సూపా పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు ఒక ఫంక్షన్‌హాలులో వారిని నిర్బంధించి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆ తరువాత వారిని పుణేకు పంపించివేశారు. అంతకుముందు, పోలీసులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు.
గణతంత్ర వేడుకల రోజున మహిళలకు ఇది చీకటిరోజు అంటూ నినదించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ ప్రవేశంపై మహిళల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగానికే అవమానమన్నారు. తమను ఎందుకు అడ్డుకున్నారో ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్ చెప్పాలని డిమాండ్ చేశారు. శనిసింగ్నాపూర్ గ్రామస్తులతో వివాదం తలెత్తకుండా చూసేందుకు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని అహ్మద్‌నగర్ ఏఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
కాగా, ఆలయంలో ప్రవేశం కోరుతున్న మహిళా ప్రతినిధులతో చర్చించి వివాదా న్ని పరిష్కరించుకోవాలని శని సింగ్నాపూర్‌లోని శని దేవాలయ కమిటీ అధికారులకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సూచించారు. హిందూ సంప్రదాయా లు మహిళలకు పూజలు చేసే హక్కును కల్పించాయని, ప్రార్థనల్లో వివక్ష కూడదని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
మహిళలపై నిషేధానికి శాస్త్రాధారాలు లేవు
శని దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తూ భూమాత బ్రిగేడ్ మహిళలు చేపట్టిన ఆందోళనకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మహిళలను నిషేధిస్తూ ఎలాంటి శాస్త్రాధారాలు లేవని, స్త్రీ, పురుషులు సమానమని, పురుషులు వెళ్లే ప్రతీగుడికీ మహిళలూ వెళ్లవచ్చని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీరవిశంకర్ అన్నారు. ‘గతంలో మహిళలు గాయత్రి మంత్రాన్ని జపించకూడదనేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా వేదాలు చదువుకుంటున్నారు’ అన్నారు.