ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఆలయాల్లోకి ప్రవేశం మాత్రం లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆధునిక మహిళలు. సుప్రసిద్ధ ఆలయాల్లోకి తాము వెళ్లకుండా అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శబరిమల, శని సింగనాపూర్ ఆలయాల్లోని ప్రవేశించకుండా తమపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తున్నారు. మగాళ్లతో సమానంగా తమకు ఆలయ ప్రవేశం కల్పించాలని పోరాడుతున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పడతులు ప్రయత్నం చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సనాతన వాదులు ఈ చర్యను తప్పుబడుతున్నారు. ఆచార వ్యవహారాలను మంటగలుపుతూ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వందలాది ఏళ్లుగా నిష్టగా ఆచరిస్తున్న ఆచారాలను ఉల్లంఘించడానికి తాము సిద్దంగా లేమని శని సింగనాపూర్ ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్టతలు, పద్ధతులు ఉంటాయని వాటిని పాటించాలని అంటున్నారు. ఆలయంలో కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని సింగనాపూర్ ఆలయ బోర్డు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనితా సేథే చెప్పడం గమనార్హం.
సమాన హక్కుల కోసం పోరాడుతుంటే తమపై నిందలు వేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దేవుడి ముందు అంతా సమానమే అయినప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారు. పౌర హక్కులు, మత స్వేచ్చను హరించేందుకు ఎవరికీ హక్కు లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని క్లాజ్ 20(బీ) ఆర్టికల్ 25 మతస్వేచ్ఛ ను కాపాడాలని చెబుతోందని గుర్తు చేస్తున్నారు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి తమను అనుమతించాలని తాజాగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, తమపై నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని వారంటున్నారు.
ఈ వివాదంపై అనుకూల, ప్రతికూల వాదనలతో సోషల్ మీడియాలో వాడివేడీగా చర్చలు నడుస్తున్నాయి. రైట్ టు ప్రే, రైట్ టు వర్షిప్ హాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. పురుషులను అనుమతించని ఒక్క హిందూ దేవాలయం కూడా లేదు, మరి మహిళలకు ఆంక్షలు ఎందుకుని కిరణ్ బేడీ ట్వీటర్ లో ప్రశ్నించారు. లక్ష్మి, దుర్గ, సరస్వతి దేవతలను శక్తి, సిరిసంపదలు, చదువుల కోసం పూజించే ఆచారమున్న దేశంలో మహిళలపై వివక్ష ఎలా చూపుతారని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. అయితే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సూచించారు. తమపై విధించిన ఆంక్షల సంకెళ్లను తెంచడానికి ఇంకెంత కాలం పోరాటం చేయాలని మహిళా లోకం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.