రోడ్లు, భవనాల శాఖతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: రహదారుల నిర్వహణ పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే అన్ని చోట్ల అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వాహనాల రద్దీని బట్టి ప్రాధాన్యత ఇస్తూ రహదారులను బాగు చేయాలని పేర్కొన్నారు. వంతెనలు, అప్రోచ్ రహదారులు, ఆర్ఓబీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఆయా రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. (చదవండి: దసరా ఉత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం)
మున్సిపాలిటీలలో కూడా రహదారుల విస్తరణ చేపట్టాలని, రాష్ట్ర రహదారులు, జిల్లాలలో ముఖ్య రహదారుల మరమ్మతు పనులకు అవసరమైన నిధులు 2168 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేలా, గుంతలు వెంటనే పూడ్చి, ప్యాచ్ వర్క్‌లు చేపట్టాలన్నారు. ఆ మేరకు దాదాపు 3 వేల కిమీ రహదారుల ప్యాచ్ వర్క్ కోసం దాదాపు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా వెంటనే ఆ నిధులు కూడా మంజూరు చేసి పనులు మొదలయ్యేలా చూడాలని సీఎంను కోరారు. ఎన్డీబీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి రెండు నెలల్లో రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. (చదవండి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ మోడల్‌గా ఏపీ)