Sharada chit fund
-
ముగిసిన దీదీ ధర్నా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య నెలకొన్న వివాదం మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా సద్దుమణిగింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాజీవ్ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఈ తీర్పు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంప పెట్టు అనీ, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాజీవ్ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ ప్రారంభించి, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది. అయితే రాజీవ్ తన ఉద్యోగ నియమాలను ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించడం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మా నైతిక విజయమిది: మమత అరెస్టు చేయడం సహా రాజీవ్ కుమార్‌పై బలవంతపు చర్యలేవీ తీసుకోకుండా సీబీఐని సుప్రీంకోర్టు నిలువరించడం తమకు లభించిన నైతిక విజయమని మమత పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల సలహా మేరకు మూడ్రోజులుగా చేపట్టిన ధర్నాను విరమించినట్లు ఆమె ప్రకటించారు. ‘కోర్టు ఉత్తర్వులు సామాన్యుడికి, ప్రజా స్వామ్యానికి, రాజ్యాంగానికి లభించిన విజయం. మాది ప్రజా ఉద్యమం. మేం ఐక్యంగా పోరాడతాం. మేం చట్టాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం.’ అని మమత చెప్పారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ తమను వ్యతిరేకించే వారిని బ్లాక్మెయిల్ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయననీ, మోదీని గద్దె దింపేవరకు పోరాడుతానని మమత శపథం చేశారు. ఇక తన పోరాటాన్ని ఢిల్లీలో కొనసాగిస్తానని చెప్పారు. సీబీఐ అంటే తనకు గౌరవం ఉందనీ, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పతకం దొంగతనం కేసును కూడా ఆ సంస్థ ఇంతే ఉత్సాహంతో దర్యాప్తు చేయాలని మమత కోరారు. అయితే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలను మాత్రమే సీబీఐ పాటిస్తోందని మమత ఆరోపించారు. ‘దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే మోదీకి వ్యతిరేకంగా ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడకూడదు. ఎవరైనా అలా చేస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. అదే వ్యక్తులు బీజేపీలో చేరగానే ఇక వాళ్ల జోలికి ఎవరూ వెళ్లరు’ అని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంపై పోరుకు ప్రణాళికలు రచించేం దుకు ఈనెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో విపక్షాల సమావేశం ఉంటుందన్నారు. మమతకు చెంపపెట్టు: బీజేపీ సుప్రీం తీర్పు మమతకు చెంపపెట్టు లాంటిదనీ, సీబీఐకి ఇది నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘పోలీస్ కమిషనర్ సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఉద్యోగ నిమయాలను ఉల్లంఘించినందుకు రాజీవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కొందరు పోలీసు అధికారులతో కలిసి మమత ధర్నాలో రాజీవ్ కూడా పాల్గొన్నట్లు తమకు సమాచారం వచ్చిందనీ, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మలయ్ కుమార్‌ను కోరింది. చల్లగా ఉంటుంది.. షిల్లాంగ్‌లో విచారించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్ కుమార్‌ను తటస్థ ప్రదేశమైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించాలని సుప్రీం కోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ పిలిచిన తేదీల్లో షిల్లాంగ్‌కు వెళ్లి విచారణకు హాజరు కావాల ని రాజీవ్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిల్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు చెప్పింది. ‘షిల్లాంగ్‌కు వెళ్లండి. అక్కడ చల్లగా ఉంటుంది. ఇరుపక్షాలూ ప్రశాంతంగా ఉంటారు’ అని న్యాయమూర్తులు సరదాగా అన్నారు. రాజీవ్ కుమార్ విచారణకు గైర్హాజరవడానికి కారణమేమీ లేదనీ, కాబట్టి ఆయనపై బలవంతపు చర్యలేవీ వద్దని కోర్టు పేర్కొంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించిన కీలక ఆధారాలు, సాక్ష్యాలను రాజీవ్ నాశనం చేశారనీ ఆరోపిస్తూ, ఆయనను విచారించేందుకు అనుమతించాల్సిందిగా సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ కేసులను ఓ ప్రత్యేక బృందం (సిట్) అప్పట్లో రాజీవే పర్యవేక్షణలోనే దర్యాప్తు చేసింది. రాజీవ్ సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ కొంచెమైనా ప్రయత్నించినట్లు తేలితే ఆయన పశ్చాత్తాప పడేలా తమ చర్యలుంటాయని సుప్రీంకోర్టు సోమవారమే హెచ్చరించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాజీవ్‌తోపాటు బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీల పేర్లను కూడా సీబీఐ పిటిషన్లో పేర్కొంది. దీంతో వీరంతా ఫిబ్రవరి 18లోపు తమ స్పందన తెలియజేయాలనీ, ఆ తర్వాత అవసరమైతే ఫిబ్రవరి 20న వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు, బెంగాల్ పోలీస్ తరఫున ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి సీబీఐకి బెంగాల్ పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలు, ఆధారాలు అసలైనవి కాదనీ, కాల్‌డేటాలో కొంత సమాచారాన్ని తొలగించడం వంటి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అధికార తృణమూల్‌కు సన్నిహితులు, లేదా సంబంధీకులు చిట్‌ఫండ్ కుంభకోణాల కేసుల్లో అరెస్టయ్యారని వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరు కావాలని రాజీవ్‌కు మూడుసార్లు సీబీఐ నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని ఏజీ తెలిపారు. -
చిదంబరం భార్యను విచారించిన సీబీఐ!
న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినీ చిదంబరాన్ని సీబీఐ శనివారం చెన్నైలో విచారించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆమెకు శారదా గ్రూప్ చెల్లించిన లీగల్ ఫీజు విషయమై సీబీఐ ఆరా తీసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శారదా గ్రూప్ తరఫు లాయర్‌గా ఆమెకు కోటి రూపాయల లీగల్ ఫీజు చెల్లించినట్లు గ్రూప్ చైర్మన్ సుదీప్త సేన్ గతంలో సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ టీవీ చానల్‌ను సొంతం చేసుకునే ప్రణాళికల్లో భాగంగా తగిన సలహా ఇవ్వడానికి ఆమెను శారదా గ్రూప్ నియమించుకుంది. -
మమతను వణికిస్తున్న ‘శారద’
శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ప్రాంత ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫొటోను ఉపయోగించుకున్నాడు. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. రాజకీయ స్పర్శతో అవినీతి, మోసం, దగా వంటి పదాల అర్థం, లోతు విశేషంగా విస్తరించాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగా ల్‌నూ, అక్కడ రాజ్యమేలుతున్న తృణమూల్ కాంగ్రెస్‌నూ ఎబోలాను మించి వణికిస్తున్న శారదా చిట్‌ఫండ్ కుంభకోణా నికి ఆ మూడు లక్షణాలు ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడేళ్లలో రూపాయి లాభం అంటూ ప్రజలను బురిడీ కొట్టించే పొంజి తరహా కుంభకోణమిది. దేశంలోనే అతి పెద్ద పొంజీ మార్కు (పొంజి అనేవాడు అమెరికాలో ఇలాగే మోస గించాడని ఆ పేరే ఖాయం చేశారు) కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రులు, ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మాజీ నక్సల్, గొప్ప కళాకారులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. శారదా చిట్‌ఫండ్ తూర్పు భారతంలోనే పెద్ద సంస్థ. పది పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఉన్నాయంటేనే ఆ సంస్థ విస్తృతి ఎంతో అర్థమవుతుంది. 2006లో ఆరంభమైన ఈ సంస్థ ఏడేళ్ల లోనే రూ. 20,000 కోట్ల వ్యాపారానికి ఎదిగిపోయింది. ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించినవాడే సుదీప్తసేన్. ఏప్రిల్ 15, 2013న ఈ కుంభకోణం ఉరుములేని పిడు గులా పశ్చిమబెంగాల్ మీద పడింది. తన మూడు సెల్ఫోన్లకు గళ దిగ్బంధనం చేసి, సేన్ పరారీ కావడంతో గగ్గోలు మొద లైంది. అయితే ఏప్రిల్ 23నే ఇతడిని కాశ్మీర్లో అరెస్టు చేయ డంతో అనేక దేవరహస్యాలు పత్రికలకెక్కాయి. పశ్చిమ బెంగా ల్లోని 19 జిల్లాలలో నాలుగు లక్షల మంది మదుపుదారులను సుదీప్త నిలువునా ముంచాడు. ఈ కుంభకోణం మొత్తం రూ.10,000 కోట్లని సీబీఐ తేల్చింది. నిజానికి 1990లో సంచయని సేవింగ్స్ చిట్‌ఫండ్ సంస్థ దివాలా అనుభవం బెంగాల్‌కు ఉంది. సుదీప్త చేసినది తాజా మోసం. శారద చిట్‌ఫండ్ కార్యకలాపాలు ఎలా ఉండేవి? దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఉదంతం చూస్తే చాలు, అంతా అర్థమ వుతుంది. ఇతడు 500 మందిని తన కింద నియమించాడు. వీరంతా 50మంది వంతున ఖాతాదారులను చేర్చారు (మొత్తం 3 లక్షల మంది ఏజెంట్లు). శారద సంస్థ రకరకాల ప్యాకేజీలను జనం ముందుకు తెచ్చింది. ఇంటి స్థలం, ఇల్లు కొనవచ్చు. వ్యవసాయోత్పత్తులలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొంత మదుపు తరువాతైనా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరిం చిన మొత్తం మీద 14 శాతం వరకు వడ్డీ ఇస్తారు. ఇదీ ప్రచారం. చిత్రంగా పోలీసు అధికారుల భార్యలను ఎక్కువగా ఏజెంట్లుగా నియమించేవారు. బెంగాల్ గ్రామీణ ప్రజలు, చిన్న పట్టణాల ప్రజలు ఎగబడి డబ్బు పెట్టారు. శారదా చిట్‌ఫండ్ దివాలా తీశాక 14 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే సంస్థ మూతపడింది. ఇంతకీ సుదీప్త ఎవరు? 1970ల నాటి నక్సల్ ఉద్యమంలోకి ఆవేశంగా వెళ్లిన శంక రాదిత్య సేన్, పదేళ్ల తరువాత హఠాత్తుగా ప్లాట్ల వ్యాపారిగా అవతరించాడు. కొద్దికాలం తరువాత అతడే సుదీప్తసేన్ పేరుతో శారదా చిట్‌ఫండ్‌ను నెలకొల్పాడు. సుదీప్తతో మాట్లా డిన వారు, చూసిన వారు తక్కువ. తన మీడియా విభాగం సీఈఓ కునాల్ ఘోష్‌ను కూడా సుదీప్త సమావేశానికి అనుమ తించేవాడు కాదు. ఆ పత్రికల సంపాదకురాలు ప్రఖ్యాత నటి అపర్ణా సేన్. ఆమె తన కార్యాలయాన్ని మూడున్నర కోట్లతో ఆధునీకరించిన సంగతి మీద ఇప్పుడు సీబీఐకి వివరణ ఇచ్చారు. కునాల్ తృణమూల్ తరఫున రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. సుదీప్తకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాం తంలో ఐదు ఇళ్లు ఉన్నాయని వెల్లడైంది. అతడికి ముగ్గురు భార్యలని సాక్షాత్తూ మమతా బెనర్జీ నిరుడు ఏప్రిల్ 13న ప్రక టించడం విశేషం. ఇప్పుడు సుదీప్త విజృంభణకు మీరంటే మీరే కారణమని సీపీఎం, తృణమూల్ ఆరోపించుకుంటున్నాయి. కానీ తనకూ, తృణమూల్కూ ఉన్న బంధం ఎలాంటిదో సీబీఐకి రాసిన 18 పేజీల లేఖలో సుదీప్త క్షుణ్ణంగా ఆవిష్కరిం చాడు. రూపూ రేఖా లేకపోయినా మమత వేసిన పెయింటిం గుల కొనుగోలుకు కోటీ ఎనభై లక్షల రూపాయలు వెచ్చించానని ఆ కళాహృదయుడు వాపోయాడు. ఆ పార్టీ ఎంపీ సృంజయ్ బోస్ పేరు కూడా లేఖలో రాయడంతో ఇతడిని సీబీఐ ప్రశ్నించింది. ఇతడు అరెస్టయిన కొద్దిసేపటికే 2012లో సుదీప్త, మమత డార్జిలింగ్ దగ్గర సమావేశమైన సంగతిని బయటపెట్టాడు. కాబట్టి ఇప్పుడు మమత ప్రమేయం మీద సీబీఐ దృష్టి సారించింది. కాగా, నటి, టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్. శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫోటోను ఉపయోగించుకున్నాడు. శారద చిట్‌ఫండ్ అంబులెన్స్ సర్వీసులను ఆమె ప్రారంభించినప్పటి ఫోటో అది. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. 1990లో బెంగాల్‌ను కుదిపిన సంచయిన అధిపతి భూదేబ్ సేన్, సుదీప్త తండ్రేనన్న అనుమానాలు మరో కొసమెరుపు. గోపరాజు