మమతను వణికిస్తున్న ‘శారద’ | Mamata vanikistunna of 'complaining' | Sakshi
Sakshi News home page

మమతను వణికిస్తున్న ‘శారద’

Published Fri, Sep 12 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

మమతను వణికిస్తున్న ‘శారద’

మమతను వణికిస్తున్న ‘శారద’

శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ప్రాంత ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫొటోను ఉపయోగించుకున్నాడు. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు.
 
రాజకీయ స్పర్శతో అవినీతి, మోసం, దగా వంటి పదాల అర్థం, లోతు విశేషంగా విస్తరించాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగా ల్‌నూ, అక్కడ రాజ్యమేలుతున్న తృణమూల్ కాంగ్రెస్‌నూ ఎబోలాను మించి వణికిస్తున్న శారదా చిట్‌ఫండ్ కుంభకోణా నికి ఆ మూడు లక్షణాలు ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడేళ్లలో రూపాయి లాభం అంటూ ప్రజలను బురిడీ కొట్టించే పొంజి తరహా కుంభకోణమిది. దేశంలోనే అతి పెద్ద పొంజీ మార్కు (పొంజి అనేవాడు అమెరికాలో ఇలాగే మోస గించాడని ఆ పేరే ఖాయం చేశారు) కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రులు, ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మాజీ నక్సల్, గొప్ప కళాకారులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.

 శారదా చిట్‌ఫండ్ తూర్పు భారతంలోనే పెద్ద సంస్థ. పది పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఉన్నాయంటేనే ఆ సంస్థ విస్తృతి ఎంతో అర్థమవుతుంది. 2006లో ఆరంభమైన ఈ సంస్థ ఏడేళ్ల లోనే రూ. 20,000 కోట్ల వ్యాపారానికి ఎదిగిపోయింది. ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించినవాడే సుదీప్తసేన్.

ఏప్రిల్ 15, 2013న ఈ కుంభకోణం ఉరుములేని పిడు గులా పశ్చిమబెంగాల్ మీద పడింది. తన మూడు సెల్‌ఫోన్లకు గళ దిగ్బంధనం చేసి, సేన్ పరారీ కావడంతో గగ్గోలు మొద లైంది. అయితే ఏప్రిల్ 23నే ఇతడిని కాశ్మీర్‌లో అరెస్టు చేయ డంతో అనేక దేవరహస్యాలు పత్రికలకెక్కాయి. పశ్చిమ బెంగా ల్‌లోని 19 జిల్లాలలో నాలుగు లక్షల మంది మదుపుదారులను సుదీప్త నిలువునా ముంచాడు. ఈ కుంభకోణం మొత్తం రూ.10,000 కోట్లని సీబీఐ తేల్చింది. నిజానికి 1990లో సంచయని సేవింగ్స్ చిట్‌ఫండ్ సంస్థ దివాలా అనుభవం బెంగాల్‌కు ఉంది. సుదీప్త చేసినది తాజా మోసం.

శారద చిట్‌ఫండ్ కార్యకలాపాలు ఎలా ఉండేవి? దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఉదంతం చూస్తే చాలు, అంతా అర్థమ వుతుంది. ఇతడు 500 మందిని తన కింద నియమించాడు. వీరంతా 50మంది వంతున ఖాతాదారులను చేర్చారు (మొత్తం 3 లక్షల మంది ఏజెంట్లు). శారద సంస్థ రకరకాల ప్యాకేజీలను జనం ముందుకు తెచ్చింది. ఇంటి స్థలం, ఇల్లు కొనవచ్చు. వ్యవసాయోత్పత్తులలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొంత మదుపు తరువాతైనా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరిం చిన మొత్తం మీద 14 శాతం వరకు వడ్డీ ఇస్తారు. ఇదీ ప్రచారం. చిత్రంగా పోలీసు అధికారుల భార్యలను ఎక్కువగా ఏజెంట్లుగా నియమించేవారు. బెంగాల్ గ్రామీణ ప్రజలు, చిన్న పట్టణాల ప్రజలు ఎగబడి డబ్బు పెట్టారు. శారదా చిట్‌ఫండ్ దివాలా తీశాక 14 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే సంస్థ మూతపడింది. ఇంతకీ సుదీప్త ఎవరు?

1970ల నాటి నక్సల్ ఉద్యమంలోకి ఆవేశంగా వెళ్లిన శంక రాదిత్య సేన్, పదేళ్ల తరువాత హఠాత్తుగా ప్లాట్ల వ్యాపారిగా అవతరించాడు. కొద్దికాలం తరువాత అతడే సుదీప్తసేన్ పేరుతో శారదా చిట్‌ఫండ్‌ను నెలకొల్పాడు. సుదీప్తతో మాట్లా డిన వారు, చూసిన వారు తక్కువ.  తన మీడియా విభాగం సీఈఓ కునాల్ ఘోష్‌ను కూడా సుదీప్త సమావేశానికి అనుమ తించేవాడు కాదు. ఆ పత్రికల సంపాదకురాలు ప్రఖ్యాత నటి అపర్ణా సేన్. ఆమె తన కార్యాలయాన్ని మూడున్నర కోట్లతో ఆధునీకరించిన సంగతి మీద ఇప్పుడు సీబీఐకి వివరణ ఇచ్చారు. కునాల్ తృణమూల్ తరఫున రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. సుదీప్తకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాం తంలో ఐదు ఇళ్లు ఉన్నాయని వెల్లడైంది. అతడికి ముగ్గురు భార్యలని సాక్షాత్తూ మమతా బెనర్జీ నిరుడు ఏప్రిల్ 13న ప్రక టించడం విశేషం. ఇప్పుడు సుదీప్త విజృంభణకు మీరంటే మీరే కారణమని సీపీఎం, తృణమూల్ ఆరోపించుకుంటున్నాయి.

 కానీ తనకూ, తృణమూల్‌కూ ఉన్న బంధం ఎలాంటిదో సీబీఐకి రాసిన 18 పేజీల లేఖలో సుదీప్త  క్షుణ్ణంగా ఆవిష్కరిం చాడు. రూపూ రేఖా లేకపోయినా మమత వేసిన పెయింటిం గుల కొనుగోలుకు కోటీ ఎనభై లక్షల రూపాయలు వెచ్చించానని ఆ కళాహృదయుడు వాపోయాడు. ఆ పార్టీ ఎంపీ సృంజయ్ బోస్ పేరు కూడా లేఖలో రాయడంతో ఇతడిని సీబీఐ ప్రశ్నించింది. ఇతడు అరెస్టయిన కొద్దిసేపటికే 2012లో సుదీప్త, మమత డార్జిలింగ్ దగ్గర సమావేశమైన సంగతిని బయటపెట్టాడు. కాబట్టి ఇప్పుడు మమత ప్రమేయం మీద సీబీఐ దృష్టి సారించింది. కాగా, నటి, టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్. శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫోటోను ఉపయోగించుకున్నాడు. శారద చిట్‌ఫండ్ అంబులెన్స్ సర్వీసులను ఆమె ప్రారంభించినప్పటి ఫోటో అది.

ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. 1990లో బెంగాల్‌ను కుదిపిన సంచయిన అధిపతి భూదేబ్ సేన్, సుదీప్త తండ్రేనన్న అనుమానాలు మరో కొసమెరుపు.
 
గోపరాజు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement