దీదీకి షాకుల మీద షాకులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా వెళ్దామని అనుకున్నందుకు మమతా బెనర్జీకి అనుకోని షాక్ తగిలింది. ఒక్కసారిగా ట్విట్టర్ జనాలు మమత మీద తమకున్న కసి అంతటినీ తీర్చేసుకున్నారు. ఆమె ఒక్క ట్వీట్ చేశారో లేదో.. వందలాది ట్వీట్లతో ఒకరకంగా కుమ్మేశారు. కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయగానే మమతా బెనర్జీ.. 'సీఎం కార్యాలయాన్ని సీల్ చేయడం ఎప్పుడూ లేదు. నేను షాకయ్యాను' అని ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సరిగ్గా ఉదయం 11.18 నిమిషాలకు వచ్చింది. కొద్ది సేపటికే కేజ్రీవాల్ ఆమెకు సమాధానం ఇస్తూ, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని వ్యాఖ్యానించారు. సాయంత్రానికి చూస్తే, వేలాది మంది మమత ట్వీట్ల మీద స్పందించారు.
అందులో ఎక్కువ మంది శారదా స్కాంను ప్రస్తావిస్తూ.. ఇక తర్వాత మీ వంతేనని చెప్పారు. మరికొందరేమో 'అది బెంగాల్ పోలీసు కాదు.. సీబీఐ' అని ఎద్దేవా చేశారు. సత్యాన్వేషి అనే ఐడీతో ఉన్న వ్యక్తి అయితే, 'అసలు వాళ్లు శారదా స్కాం విషయం పట్టించుకోకుండా ఢిల్లీ కేసును ఎలా విచారిస్తారు.. నేను కూడా షాకయ్యాను. అరవింద్ కేజ్రీవాల్ కంటే మీరే ముందుండాల్సింది.. మీకు నా సానుభూతి' అని ట్వీట్ చేశాడు. కోల్‌కతాలో మమతాబెనర్జీ కార్యాలయం ఉన్న రాష్ట్ర సచివాలయం పేరు నబన్నా. శారదా స్కాంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి శంకు పాండాను సీబీఐ వర్గాలు ప్రశ్నించడంతో ఆయనను పార్టీ పదవి నుంచి తొలగించారు. ఈ స్కాంలో చాలా మంది పార్టీ నాయకులు లబ్ధిదారులుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ జనాల్లో ఎక్కువ మంది శారదా స్కాంను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీని ఉతికి ఆరేశారు.