సమగ్ర దర్యాప్తు జరిపించండి!
న్యూఢిల్లీ: శారదా చిట్స్ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ లెఫ్ట్ పార్టీల నేతలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అన్ని దర్యాప్తు సంస్థలను సమన్వయం చేస్తూ ఈ తరహా మోసపూరిత స్కీములన్నింటిపై విచారణ జరిపించాలని కోరారు. శారదా కేసులో సెబీ, సీబీఐ, వంటి కేంద్ర సంస్థలు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయని, అయితే దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ స్కామ్ మూలాల్లోకి వెళ్లడానికి అన్ని సంస్థల సంయుక్త దర్యాప్తు అవసరమని సూచించినట్లు సీపీఎంనేత సీతారాం ఏచూరి మీడియాకు తెలిపారు. ప్రధానిని కలసిన వారిలో సీపీఎం నేత బిమన్‌బోస్, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సుర్జోకాంత మిశ్రా, ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, ఫార్వర్డ్ బ్లాక్ నేత అలీఇమ్రాన్ రమ్జ్ ఉన్నారు.
శారదా మీడియాతో మమతకే అత్యధిక లబ్ధి: కునాల్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ కునాల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిట్‌ఫండ్ స్కాంలో ఆమెకు వ్యతిరేకంగా స్థానిక కోర్టులో సోమవారం వాంగ్మూలమిచ్చారు. శారదా గ్రూప్‌నకు చెందిన శారదా మీడియా ద్వారా మమత అత్యధిక లబ్ధి పొందారన్నారు. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు కునాల్ ఘోష్ సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. స్కాంలో మమత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ హస్తముందని పునరుద్ఘాటించారు. ‘నా వద్ద సమాచారం ఉంది. సీబీఐ నన్ను ప్రశ్నిస్తే ఆ వివరాలు వెల్లడిస్తా’ అని అన్నారు.