తండ్రి సన్నిహితుడికి అఖిలేష్ ఝలక్
లక్నో : మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి11న) ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకు తెరలేవబోతున్న నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో ఉన్నతవిద్యా శాఖామంత్రిగా పనిచేస్తున్న శారదా ప్రసాద్ శుక్లాకు ఉద్వాసన పలికారు. శుక్లను ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా తీసివేయడానికి తన క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలుపుతూ ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్‌కు అఖిలేష్ ఓ లేఖను రాశారు. ఎస్పీ సుప్రిం, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు శుక్ల సన్నిహితుడు. అయితే సమాజ్ వాద్ పార్టీ తరుఫున ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో శుక్ల ఇటీవలే రాష్ట్రియ లోక్‌దళ్‌లో చేరారు. పొత్తు పెట్టుకుందామనుకున్న ఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్లు చివరి నిమిషాల్లో విరమించుకున్నాయి. ఎస్పీ ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోదని, కేవలం కాంగ్రెస్‌తో కలిసి మాత్రమే పోటీచేస్తామని ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఎస్పీ నుంచి టిక్కెట్ దక్కకపోవడంతో శారదా ప్రసాద్ శుక్ల లక్నో సరోజిని నగర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరుఫున బరిలోకి దిగబోతున్నారు.