కుటుంబాన్ని మింగిన షేర్ మార్కెట్
-భార్య పిల్లలను కడతేర్చి భర్త ఆత్మహత్య
-అప్పులే ఆఘాయిత్యానికి కారణం
చెన్నై, సాక్షి ప్రతినిధి:
షేర్మార్కెట్లో నష్టం ఓ కుటుంబాన్ని మింగేసింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడేలా యజమానిని కుంగదీసింది. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన దేవేంద్రకుమార్ (48) భార్య దీప్తి (38), కుమార్తె శ్రుతి (15), కుమారుడు మోనత్ (7)తో చెన్నైలో కాపురం ఉంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు బీచంబర్నాథ్ (80), శోభాదేవి (66) సైతం అదే ఇంటిలో నివసిస్తున్నారు. విదేశాల్లో కొంతకాలం ఉద్యోగం చేసిన దేవేంద్రకుమార్ కొన్ని నెలల క్రితం చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. తన వద్దనున్న సొమ్ముతో షేర్మార్కెట్లో ప్రవేశించి నష్టాలపాలయ్యాడు. అప్పులు తెచ్చి మళ్లీ షేర్లు కొని మళ్లీ మునిగిపోయాడు. అప్పులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి పెరిగింది, తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించకుంటే హతమారుస్తామని బెదిరింపులు ప్రారంభమయ్యాయి.
దీంతో ఆత్మహత్యే శరణ్యమనే నిర్ణయానికి వచ్చిన దేవేంద్రకుమార్ బుధవారం చివరిసారిగా హాయిగా గడిపాడు. భార్యా పిల్లలను తీసుకుని హోటల్లో రాత్రి భోంచేసి సెకెండ్షో సినిమాకు వెళ్లారు. పిల్లలు, భార్యా భర్తలు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. తెల్లవారుజామున కత్తితో తిరుగుతున్న కుమారుడి వైఖరిని తల్లి షోబాదేవి అనుమానించింది. హత్యలకు పాల్పడుతున్న వైనాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేసింది. వృద్ధురాలైన ఆమెను నెట్టివేసి పిల్లల గదిలోకి వెళ్లి ఇద్దరి గొంతుకోసి హతమార్చాడు. ఆ తరువాత తన గదిలోకి వచ్చి భార్యను సైతం అదే కత్తితో గొంతుకోసి ప్రాణాలు తీసి తాను గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కళ్ల ఎదుటే కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడడం కళ్లారా చూసిన శోభాదేవి పోలీసుల ముందు బాధతో విలవిలలాడిపోయింది. హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా దేవేంద్రకుమార్ పదో తేదీతో రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.