ఎస్బీఐ 15,000 కోట్ల ఇష్యూకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.15,000 కోట్ల విలువైన వాటా విక్రయ ప్రయత్నాల జోరును పెంచింది. ఈ వాటా విక్రయం కోసం 9 మంది మర్చంట్ బ్యాంకర్లను ఎస్బీఐ ఎంపిక చేసిందని సమాచారం. గోల్డ్‌మన్ శాక్స్, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ, ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను మర్చంట్ బ్యాంకర్లుగా ఎస్బీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వ్యాపార విస్తరణ కోసం, అంతర్జాతీయంగా బ్యాంకింగ్ మూలధన నిధులు అందుకోవడం కోసం ఎస్బీఐ ఈ భారీ స్థాయి వాటా విక్రయాన్ని చేపడుతోంది. ఈ వాటా విక్రయం- రైట్స్ ఇష్యూ, ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్, అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్‌ల ద్వారా కానీ సమించరించనున్నది. వీటన్నింటి ద్వారా గానీ, లేదా వీటిలో ఏదో ఒక మార్గంలో రూ.15,000 కోట్ల నిధులు సమీకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో క్విప్ విధానంలో ఎస్బీఐ రూ.8,032 కోట్లను సమీకరించింది.