త్వరలో జల ఉద్యమం
* శ్రీశెలం నీటి కోసం వైఎస్సార్సీపీ పోరు
* 4 జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ త్వరలో భేటీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు : శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా విడుదలపై పోరుబాట పట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమవుతోంది. త్వరలో రాయలసీమలోని నాలుగు జిల్లాల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. డిసెంబరు 5న జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే రైతు రుణమాఫీ ధర్నాల కార్యక్రమం అనంతరం సమావేశం కావాలని అధినేత నిర్ణయించినట్టు జిల్లా నేతలు తెలిపారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిరంతరం కొనసాగిస్తోంది. దీంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం 856 అడుగులకు పడిపోయింది.
మరో రెండు అడుగులు పడిపోయి 854కు చేరితే.. రాయలసీమకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో జిల్లా పార్టీ కన్వీనరు బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో పాటు కర్నూలు, డోన్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. వాస్తవానికి శ్రీశైలం కుడిగట్టు కెనాల్ (ఎస్ఆర్బీసీ) నుంచి రాయలసీమకు 19 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 9.11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని నేతలు తెలిపారు.
అలాగే గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో మిగిలిన 10 శాతం పనులు, బనగానపల్లె వద్ద ప్రధాన కాల్వతో పాటు లైనింగ్ పనులు, అవుకు టన్నెలు పనులు పూర్తి కావాల్సి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటి విడుదలతో పాటు పెండింగ్ పనులు పూర్తిచేయాలనే డిమాండ్‌తో పోరాటం చేద్దామని జిల్లా నేతలకు జగన్మోహన్రెడ్డి వివరించినట్లు నేతలు పేర్కొన్నారు. డిసెంబరు 5 తర్వాత 4 జిల్లాల నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.