Sharia law
-
మత గురువు నుంచి తాలిబన్ చీఫ్‌గా..
కాబూల్: ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కచ్లాక్ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది. 2016లో తాలిబన్ పగ్గాలు అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్ మిలటరీ కోర్టులో అఖుంద్జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్ అధినేతగా అఖుంద్జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్జాదా కుమారుడు అబ్దుర్ రెహమాన్ అలియాస్ హఫీజ్ ఖలీద్(23) అప్పటికే తాలిబన్ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్ మరణించాడు. కనిపించడం అత్యంత అరుదు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తరహాలోనే అఖుంద్జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
షరియా.. ఉల్లంఘిస్తే ఉరే
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా? ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి. ► మగ స్నేహితులను కలవొచ్చా? 12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు. ► చదువుకోవచ్చా? మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే. ► మేకప్ వేసుకోవచ్చా? మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు. ► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా? షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు. ► కార్యాలయాల్లో పని చేయవచ్చా? చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట. ► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా? అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి. ► బిగ్గరగా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం. ► హై హీల్స్ సంగతేంటి? ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా? తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి. ► సినిమాల్లో నటించవచ్చా? మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్ చేయరాదు. ► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. -
తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ స్త్రీల పరిస్థితి ఇదే!
తాలిబన్లు ఆఫ్గనిస్తాన్‌ను 1996 నుంచి 2001 వరకు పరిపాలించారు. షరియా చట్టం ప్రకారం.. చిన్న వయసు నుంచే బాలికలను పాఠశాలలకు వెళ్ళనివ్వరు. మహిళలు ఉద్యమాలు చేయరాదు. తమ శరీరం కనిపించకుండా తల నుంచి కాళ్ల వరకూ మహిళలు నిండుగా బుర్ఖా ధరించాలి. అయితే తాలిబన్ల పాలనకు పూర్వం అఫ్గాన్‌లో స్త్రీలు ఏ విధమైన జీవనాన్ని గడిపేవారో ఓ సారి తెలుసుకుందాం. కాబూల్: అశ్వకన్, అస్సాకన్ అనే పేరు నుంచి అఫ్గాన్ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమ క్రమంగా అఫ్గానిస్తాన్‌గా పేరు మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష. ఉదార, పాశ్చాత్య జీవనశైలి శతాబ్దాలుగా అంతర్గత సంఘర్షణ, విదేశీ జోక్యంతో విచ్ఛిన్నమైన ఆఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో అఫ్గాన్ అనేక తాత్కాలిక చర్యలు తీసుకుంది. 1950,1960లలో సాంప్రదాయ వర్గాల పట్ల గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఆ సమయంలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానానికి అడుగులు పడ్డాయి. విద్య, ఓటు వేసే స్వేచ్ఛ ఆఫ్ఘన్ ప్రభుత్వం బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. కొత్త విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చి, ఓ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. అది ప్రజాస్వామ్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆఫ్గన్ మహిళలకు ఓటు హక్కును కల్పించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మహిళలు కళాశాలకు వెళ్లేందుకు మార్గం పడింది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా నిర్వహించారు. మరి కొంతమంది మహిళలు రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో కాబూల్ కాస్మోపాలిటన్ అయింది. సంపన్న సమాజం అఫ్గనిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యూఎస్, సోవియట్ యూనియన్‌తో స్నేహపూర్వకంగా మెలిగింది. సోవియట్ యంత్రాలు, ఆయుధాలను.. యూఎస్ నుంచి ఆర్థిక సహాయాన్ని అంగీకరించింది. ఆ కాలంలో అఫ్గన్‌కు చాలా ప్రశాంతమైన యుగం. పాత సాంప్రదాయ మట్టి నిర్మాణాలతో పాటు.. కాబూల్‌లో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. కొంతకాలం పాటు బుర్ఖాలు ధరించడం అనేది ఓ ఆప్షన్‌గా మారింది. దేశం సంపన్న సమాజం వైపు ఓ మార్గంలో వెలుతున్నట్లు కనిపించింది. అకస్మాత్తుగా అంతా తలకిందులు దేశంలో తాలిబన్లు పురుడు పోసుకోవడంతో అంతా తలకిందులైనది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి పీచమణిచింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. కాగా ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్లు, ఇటు ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం -
చూస్తున్నారుగా.. అందరికీ ఇదే శిక్ష పడుతుంది!
జకార్తా : ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచిన ముస్లిం అవివాహిత యువతీ యువకులకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి కాకుండా నీతి మాలిన చర్యకు పాల్పడి షరియా చట్టాలను ఉల్లంఘించారంటూ.. వారికి జైలు శిక్ష విధించడంతో పాటు కొరడా దెబ్బలు తినాల్సిందిగా మతాధికారులు ఆదేశించారు. ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమత్రా ఐలాండ్‌లోని ఇస్లాం చట్టప్రకారం గ్యాంబ్లింగ్, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా అలా ప్రవర్తించినట్లైతే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఐదు యువజంటలు విపరీత చేష్టలకు పాల్పడ్డారంటూ మత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం అనుభవించాలంటూ 22 కొరడా దెబ్బలు విధించారు. ఈ క్రమంలో షరియా అధికారి మాట్లాడుతూ.. ‘ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేనట్లైతే ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని శిక్ష అమలు చేస్తున్న సమయంలో చూస్తున్న చిన్నారులు, పెద్దలను హెచ్చరించారు. కాగా ఇలాంటి క్రూర చర్యలకు తీవ్రమైన నేరంగా పరిగణించాలని వామపక్షాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది మతంతో ముడిపడిన సున్నిత అంశం కావడంతో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పేర్కొన్నారు. -
రైట్ డిసిషన్ అయినా ‘రాంగ్ టైమ్’లో తప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి జిల్లాలో ఓ ‘షరియా కోర్టు’ను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలకపక్ష భారతీయ జనతా పార్టీ అయితే అగ్గిమీద గుగ్గిలం అయింది. ఈ కోర్టులు కేవలం షరియా చట్టాన్ని మాత్రమే విశ్లేషిస్తాయని, మధ్యవర్తిత్వం కోసం వచ్చే స్త్రీ, పురుషులకు, ముఖ్యంగా భార్య భర్తలకు షరియా చట్టం ప్రకారం రాజీ కుదుర్చుతాయని, ఇచ్చే తీర్పులను పాటించడం, పాటించక పోవడం పార్టీల చిత్తమేనని, ఎలాంటి బలవంతం ఉండదని ముస్లిం లా పర్సనల్ బోర్డు వివరణ ఇచ్చినా బీజేపీ వినిపించుకోలేదు. భారత్ ఇస్లామిక్ దేశం కాదని, దేశంలోని చట్టబద్ధమైన కోర్టులకు సమాంతరంగా ఓ మైనారిటీ సమాజం సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. వాస్తవానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల పలు ముస్లిం సంఘాలే ధ్వజమెత్తాయి. దేశంలో ఎక్కువగా ఉన్న సున్నీ ముస్లింలే షరియా కోర్టులను కోరుకుంటారు. షియాలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి సున్నీలు కూడా రెండు విధాలుగా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే దేశంలో అణచివేతకు గురవుతున్నారని, ఈ నిర్ణయం వల్ల మరింత అణచివేతకు గురికావాల్సి వస్తోందని ఓ వర్గం సున్నీలు అభిప్రాయపడగా, షరియా తీర్పులను అమలు చేసే వ్యవస్థ లేనప్పుడు షరియా కోర్టుల వల్ల లాభమేమని మరో వర్గం సున్నీలు ప్రశ్నించారు. షరియా రాజ్యాంగం అమల్లోలేని రాజ్యంలో షరియా చట్టాన్ని ఎలా అమలు చేస్తారని పలు షియా సంఘాలు ప్రశ్నించాయి. షరియా అంటే ఏమిటీ? షరియా కోర్టును దారుల్ ఖాజా అని కూడా వ్యవహరిస్తారు. షరియా అంటే అరబిక్ భాషలో న్యాయ వ్యవస్థ అని అర్థం ఇక దారుల్ ఖాజా అంటే ‘ఇంటి తీర్పు’ అని అర్థం. అఖిల భారత ఇస్లామిక్ పర్సనల్ లా బోర్డు ఇప్పటి వరకు దేశంలో 50 షరియా కోర్టులను ఏర్పాటు చేసింది. వాటికి తీర్పు చెప్పే ఖాజీలను కూడా అదే నియమిస్తోంది. ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున పెంచాలని నిర్ణయించడం వివాదాస్పదమైంది. షరియా కోర్టుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ఓ సారి చదివి స్పందించాలని విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవించడం పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డుకు విశ్వాసం ఉందని, భార్యాభర్తల తగాదాలను, ఆస్తుల పంపకాల వివాదాలను అతి తక్కువ ఖర్చుతో, అతి తొందరగా షరియా కోర్టులు తీరుస్తున్నాయని అఖిల భారత ముస్లిం ఏ ఇత్తేహాదుల్ ముస్లిమెన్ అధ్యక్షుడైన ఓవైసీ వివరించారు. ఇలాంటి న్యాయం ముస్లిం కమ్యూనిటీకి మరింత చేరువ చేయడం కోసమే పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకున్నదని అందులో సభ్యుడు కూడా అయిన ఓవైసీ వివరించారు. సుప్రీం కోర్టు ఇంతకు ఏం చెప్పిందీ? దేశంలోని షరియా కోర్టులకు చట్టపరమైన అధికారాలేవీ లేవని, అవిచ్చే తీర్పులను కచ్చితంగా పాటించాలనే నిబంధనలూ లేవని బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే 2014, జూలై నెలలో స్పష్టం చేసింది. వాటిని నిషేధించాలనే డిమాండ్‌ను కూడా త్రోసిపుచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనందున, ఓ కమ్యూనిటీ సంస్థగానే పనిస్తున్నందున వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. షరియత్ కోర్టుల అమలుకు ఎలాంటి వ్యవస్థ లేనందున వాటిని ఏర్పాటు చేయడం న్యాయ వ్యవస్థకు పోటీ అవుతుందని భావించడంలో అర్థం లేదని హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్ జాఫర్ సరేశ్‌వాలా వ్యాఖ్యానించారు. సత్వర న్యాయం కోసమే షరియత్ కోర్టులు అవసరమని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల రెహనుమా భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టు చుట్టూ రెండేళ్లు తిరిగినా విడాకులు లభించలేదని, ఆమె అదే సహ్రాన్‌పూర్‌లోని దారుల్ ఖాజాకు వెళ్లగా రెండే రోజుల్లో విడాకులు లభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఎప్పటి నుంచో షరియా కోర్టులు నడుస్తున్నాయని, వాటి పట్ల ఎప్పుడూ వ్యతిరేకత లేదని, ఇప్పుడు మరిన్ని వాటిని ఏర్పాటు చేయాలనుకోవడంతో వ్యతిరేకత వచ్చిందని, తీసుకున్న నిర్ణయం సరైనదైనా తీసుకున్న సమయం సరైనది కాదని ‘అఖిల భారత ఉలేమా మెహసాయిక్ బోర్డు’ అధికార ప్రతినిధి యూసుఫ్ మొహాని వ్యాఖ్యానించారు. సరైన సమయం కాదనడం అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అనే అర్థం అని అందరికి అర్థం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇలాంటి అంశాలు అనవసరంగా వివాదాస్పదమవుతాయి. -
బొట్టు పెట్టుకొని మదర్సా వెళ్లిందని..!
తిరువనంతపురం : మత సంప్రదాయాలు, కట్టుబాట్లు మంటగలిపిందనే కారణంగా ఐదో తరగతి విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించిన ఘటన ఉత్తర కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కేరళకు చెందిన ఉమర్ మలయిల్ అనే వ్యక్తి కూతురు మదర్సాలో విద్యనభ్యసిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆమె ఒక షార్ట్ ఫిలింలో నటించేందుకు సిద్ధపడింది. నటనలో భాగంగా నుదటిపై గంధాన్ని బొట్టుగా ధరించింది. దీంతో ఆగ్రహించిన మదర్సా యాజమాన్యం.. ముస్లిం అయివుండి ఇలాంటి చర్యకు పాల్పడడం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొంటూ ఆమెను బహిష్కరించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి తన కూతురి పట్ల మదర్సా వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఫేస్బుక్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. ‘ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందు ఉండే నా కూతురు అనేక బహుమతులు పొందింది. ఎంతో ప్రతిభావంతురాలైన నా కూతుర్ని మదర్సా నుంచి తొలగించారనే వార్త తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. నుదుటన గంధపు తిలకం ధరించడమే ఆమె చేసిన పొరపాటు అని వారు చెప్పారు. ఆ సమాధానానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదంటూ’ ఉమర్ మలయిల్ వాపోయారు. కాగా ఆయన పోస్టుకు స్పందించిన నెటిజన్లు మదర్సా తీరును తప్పు పట్టగా.. మరికొంత మంది మాత్రం ‘నీ కూతురికి సరైన శిక్ష పడింది. ఇస్లాంను, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ’ నెగటివ్ కామెంట్లు చేశారు. -
11 మంది భర్తలు.. రాళ్లతో కొట్టి చంపారు..
మొగదిషు, సోమాలియా : సోమాలియాలో ఘోరం జరిగింది. 11 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను అల్ షబాబ్ మిలిటెంట్లు రాళ్లతో కొట్టి చంపారు. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండా 11 మందిని వివాహం చేసుకుంది. సోమాలియా రాజధాని మొగదిషుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో తరచూ రైడ్స్ నిర్వహించే అల్ షబాబ్ మిలిటెంట్లు ఈమెను పట్టుకున్నారు. విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకున్నందుకు షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టిచంపాలని నిర్ణయించారు. దీంతో ఆమెను గొంతు వరకూ భూమిలో పూడ్చి రాళ్లతో కొట్టి చంపారు. షుక్రికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. విచారణ సమయంలో మహిళ భర్తలను పిలిపించామని, ఆమె తన భార్య అంటే తన భార్య అని ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చారని అల్ షబాబ్ గవర్నర్ ఒకరు తెలిపారు. -
‘షరియా’ నీడనే ముస్లిం మహిళలకు భద్రత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు తమకు షరియా చట్టం నీడనే రక్షణ ఉంటుందని భావిస్తున్నారని, ఏకీకృత పౌరస్మృతిని వారు కోరుకోవడం లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. ఒక్క పర్సనల్ లా బోర్డ్ లేదా అందులోని మహిళలు మాత్రమే ఈ ఏకీకృత పౌరస్మృతిని వ్యతిరేకించడం లేదని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నారని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫరూకీ అన్నారు. వారంతా షరియా చట్టం ద్వారానే సురక్షితంగా ఉండగలమని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐఎంపీఎల్బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆస్మా జెహ్రా మాట్లాడుతూ.. ‘ముస్లిం పర్సనల్ లా’ రక్షించుకునేందుకు దేశంలోని ముస్లిం మహిళలందరూ కలసికట్టుగా ముందుకొస్తున్నారని చెప్పారు. ఇతర వర్గాలతో పోలిస్తే తమ మతంలోనే విడాకుల సంఖ్య చాలా తక్కువ అని తెలిపారు. విడాకుల తర్వాత కూడా అనేక హక్కులు ముస్లిం మహిళలకు వర్తిస్తాయని చెప్పారు. అంతేకాకుండా మళ్లీ వివాహం చేసుకొని నూతన జీవితాన్ని కూడా ఆరంభించొచ్చని వివరించారు. ఇది హిందూ, ముస్లింల సమస్య కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట వాస్తవమేనని, ఇది కేవలం ఆరెస్సెస్ సమస్య మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసుపై విచారణ నడుస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించి, ఏకీకృత పౌరస్మృతిని అమలు చేయాలని పలు ముస్లిం మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు వారి డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏఐఎంపీఎల్బీ వివిధ రాష్ట్రాల్లో సంతకాల సేకరణ నిర్వహిస్తోంది.