sharp shooters
-
తుపాకీ అవ్వలు
ఉత్తర ప్రదేశ్‌లో 80 ఏళ్ల వయసులో కూడా షార్ప్ షూటర్లు రాణించి వందల కొద్దీ మెడల్స్ గెలుస్తున్న చంద్రు తోమర్, ప్రకాషి తోమర్‌లపై ఇప్పుడు సినిమా సిద్ధమవుతోంది. అరవై ఏళ్లు దాటితే కృష్ణా రామా అనుకోవాలని ఈ సంఘం ఒక ఆనవాయితీని విధించి ఉంది. ఇక స్త్రీలు అరవై దాటాక మనవలు మనవరాళ్లను చూసుకుంటూ ఏదో ఒక మగతోడు లేకుండా గడప దాటే వీలు లేకుండా ఉండాలని కూడా సంఘం భావిస్తుంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అవ్వలు ఈ ఆనవాయితీని భగ్నం చేశారు. వారు కూరగాయలు కోసే కత్తిని, కత్తి పీటను వదిలి ఏకంగా తుపాకిని పట్టుకున్నారు. షార్ప్ షూటర్లు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వందలకొద్దీ మెడల్స్ సంపాదిస్తున్నారు. మెడల్స్ వల్ల వారి వ్యక్తిగత కీర్తి పెరిగి ఉండవచ్చు. కాని వారు చేస్తున్న ఈ పని వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడపిల్లల ధైర్యం పెరిగింది. వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. మగాళ్ల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదని వారు కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారు. ఇది వారి ఆత్మ విశ్వాసానికే కాదు అవసరమైతే ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతోంది. బుల్లెట్టు ఇలా దిగింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా అయిన భాగ్‌పట్‌లోని చిన్న ఊరు జొహ్రీ. ఆ ఊరులోని అందరిలాంటి గృహిణి చంద్రు తోమార్. అప్పటికి ఆమె వయసు 65. ఎనిమిది మంది పిల్లలు, 15 మంది మనమలు, మనమరాళ్లు. ఆ ఊళ్లో రైఫిల్ క్లబ్ ఉంది. అయితే ఎక్కువగా అబ్బాయిలే అక్కడ ప్రాక్టీసు చేస్తుంటారు. కాని చంద్రు మనుమరాలు ఆ క్లబ్లో చేరాలనుకుంది. ఒక్కత్తే వెళ్లడానికి కొంచెం బిడియపడి నానమ్మను తోడు రమ్మంది. మనవరాలికి తోడుగా రెండు రోజులు వెళ్లిన చంద్రు అక్కడ ప్రాక్టీసులో మనవరాలు పడుతున్న తిప్పలు చూసి ‘అలా కాదు ఇలా కాల్చాలి తుపాకిని’ అని కోచ్ చెప్పినదాన్ని బట్టి కాల్చి చూపింది. ఆశ్చర్యం. అది నేరుగా వెళ్లి గురిని తాకింది. కోచ్ ఆశ్చర్యపోయి, ఇది పొరపాటున తగిలిందేమోనని మళ్లీ కాల్చమన్నాడు. చంద్రు సరిగ్గా మళ్లీ గురి తగిలేలా కాల్చింది. బాగా ప్రాక్టీసు ఉన్న పిల్లల కంటే చంద్రు గురి ఎక్కువగా గ్రహించిన కోచ్ ఆమెను షార్ప్ షూటర్‌గా ట్రైనింగ్ తీసుకోమన్నాడు. కాని ఆ వెనుకబడిన ప్రాంతంలో అలాంటి పని ఆ వయసులో చేయడానికి అనుమతి లేదు. అందుకని వారానికి ఒకసారి వచ్చి చంద్రు ప్రాక్టీసు చేసేది. ఇంట్లో ఎవరూ చూడకుంటే చేతిలో పట్టుకోసం జగ్గులో నీళ్లు నింపి తుపాకీని పట్టుకుని నిలుచున్నట్టు నిలుచునేది. ఆమె కంటి చూపు బాగుండటం, చేతిలో పట్టు ఉండటంతో ఆమె గురి తప్పని షూటర్‌గా కొద్ది రోజులలోనే అవతరించింది. వయోజనుల క్రీడా పోటీలకు తీసుకు వెళితే మెడల్‌తో తిరిగి వచ్చేది. మొదట ఆమె భర్త అభ్యంతరం చెప్పాడు. కాని ఊళ్లో ఆమెకు వస్తున్న పేరు, గుర్తింపు చూసి అతను కూడా ప్రోత్సహించసాగాడు. ఇది చూసి ఆమె ఆడపడుచు ప్రకాషి తోమార్‌కు కూడా ఆసక్తి కలిగింది. ఆమె కూడా తన వదిన చంద్రుతో కలిసి షూటింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. ఇద్దరూ అనతికాలంలోనే ఆ ప్రాంతంలో ‘షూటర్ దాదీస్’ (తుపాకీ అవ్వలు)గా ఖ్యాతి పొందారు. ఇప్పుడు చంద్రు వయసు 87. ప్రకాషి వయసు 82. అయినప్పటికీ లక్ష్యం చేరుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్నారు. సినిమాగా ఇద్దరి కథ గత పది పదిహేను ఏళ్లలో దేశమంతా స్ఫూర్తినింపిన ఈ కథ ఎట్టకేలకు బాలీవుడ్‌కు చేరింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనే నిర్మాతగా మారి వీరి కథను తెరకెక్కిస్తున్నాడు. సినిమా పేరు ‘సాండ్ కీ ఆంఖ్’. తెలుగువారికి సుపరిచితురాలైన తాప్సీ, ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’లో నటించిన భూమి పెడ్నెకర్ ఈ ఇద్దరు అవ్వల పాత్రలను పోషిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రొస్థెటిక్స్ పద్ధతిలో మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్ వల్ల, షూటింగ్‌లోని ఎండల వల్ల నటి భూమి ముఖం మీద రాషెస్ వచ్చేశాయి. అయినప్పటికీ ఈ పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడతాను అంటూ భూమి పేర్కొంది. తుషార్ హీరానందానీ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు హర్యాణ్వి గ్రామీణ జీవితంలో స్త్రీల మనోభావాలు, మగ పెత్తనం, దానిని దాటి స్త్రీలు తమ ఉనికిని చాటుకోవడం ఈ కథ. స్ఫూర్తిదాయకమైన నిజ జీవితాలు గతంలో పత్రికలకెక్కడమే గొప్పగా ఉండేది. కాని ఇవాళ అవి ఏకంగా సినిమాలే అవుతున్నాయి. దీపావళికి రిలీజయ్యి ఎడాపెడా పేలనున్న ఈ తుపాకీ చప్పుళ్లను విని గురి తప్పని చప్పట్లు మనం కూడా కొడదాం. -
‘అవని’ కేసు క్లోజ్!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన మ్యానీటర్ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశంలో హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్స్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్, అతడి తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌లపై పలు ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి మేనకాగాంధీ సహా అనేక స్వచ్ఛంద సంస్థలు వారిపై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమంటూ మహారాష్ట్ర సర్కారు తేల్చింది. ఈ మేరకు గత వారం అస్ఘర్ అలీ ఖాన్‌కు లేఖ రాసింది. ఇదీ ‘అవని’ నేపథ్యం... మహారాష్ట్రలోని తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయస్సున్న అవని అనే ఆడపులి గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అక్కడికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి మ్యానీటర్‌గా మారిన ఆ పులి తరచూ పంజా విసురుతూనే ఉంది. తనకు జన్మించిన రెండు పులి పిల్లలు దీంతో కలిసే ఆ ప్రాంతంలో సంచరించాయి. ఈ మూడూ కలిసి యవత్మాల్ చుట్టూ 12 కిమీ పరిధిలో తమ ‘సామ్రాజ్యాన్ని’ విస్తరించాయి. తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాన్ని పీక్కు తినేవి. వాటి చేతిలో 14 మంది చనిపోయారు. రెండు నెలలు సాగిన ఆపరేషన్... ఈ మూడింటినీ పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాల్చి చంపడానికి నిర్ణయం తీసుకుంటూ ఆ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను పోలీసు కమాండోలను రంగంలోకి దింపింది. వారు చేతులు ఎత్తేయడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాదీ హంటర్స్ షఫత్, అస్ఘర్‌లను పిలిపించింది. వీరితో పాటు మొత్తం ఆరుగురికి ‘కలింగ్ ఆర్డర్స్’గా పిలిచే హతమార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. మ్యానీటర్‌గా మారిన పులితో పాటు దాని కూనల కోసం దాదాపు రెండు నెలల పాటు గాలించిన హైదరాబాదీ హంటర్స్ 2018 నవంబర్ 3న అవనిని హతమార్చడంతో బాధిత గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు వీరిద్దరితో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్నవారిని సన్మానించి జ్ఞాపికలు అందించారు. దేశ వ్యాప్తంగా ఆరోపణల వెల్లువ... ఇలా తల్లి, రెండు పిల్లలు కలిసి జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ ప్రజలను చంపడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అయినా అవని వేట దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు, కొందరు ప్రముఖులు సైతం అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా అవనిని అస్ఘర్ చంపేశారని, దీని వల్ల దాని కూనలు చనిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. మత్తుమందు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అమానవీయంగా చంపేశారంటూ దుమ్మెత్తిపోశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న మహారాష్ట్ర సర్కారు సమగ్ర విచారణకు ఆదేశించింది. బాలిస్టర్ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదికలను అధ్యయనం చేయాలని ఆదేశించింది. దీంతో ప్రత్యేక కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సుదీర్ఘ విచారణ చేసింది. క్లీన్చిట్ ఇస్తూ లేఖ... గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షఫత్, అస్ఘర్‌లు తమ తుపాకులను ఇక్కడ డిపాజిట్ చేశారు. ఆ క్రతువు ముగిసిన తర్వాత వాటిని తీసుకుని వెళ్లి మహారాష్ట్ర సర్కారుకు అప్పగించారు. అస్ఘర్ తుపాకీతో పాటు అవని ఒంటి నుంచి తీసిన తూటాలను సరిపోల్చిన బాలిస్టిక్ నిపుణులు ఫైరింగ్ జరిగింది అందులోంచే అని తేల్చారు. మరోపక్క అవని చనిపోవడానికి ముందే దాని ఒంట్లోకి మత్తు ఇంజెక్షన్ వెళ్లిందని గుర్తించారు. ఆ మత్తు పూర్తిగా ఎక్కకముందే సమీపంలో ఉన్న బృందంపై దాడికి ప్రయత్నించడంతోనే అస్ఘర్ కాల్చాల్సి వచ్చిందని నిర్థారించారు. కలింగ్ ఆఫీ సర్స్ జాబితాలో ఉన్న ఆరుగురిలో అస్ఘర్ పేరు కూడా ఉందని, షఫత్ కేవలం సహాయానికి వెళ్లిన ట్లు పేర్కొన్న విచారణ కమిటీ ఈ ‘వేటగాళ్ల’కు క్లీన్చిట్ ఇస్తూ కేసును క్లోజ్ చేసింది. ఈ మేరకు షఫత్ అలీ ఖాన్, అస్ఘర్ అలీ ఖాన్‌లను గత వారం మహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. ఎలాంటి మ్యానీటర్ అయినా మా తొలి ప్రాధాన్యం మత్తుమందు ఇచ్చి పట్టుకోవడానికే ఉంటుందని, గత్యంతర లేని పరిస్థితుల్లోనూ తుది నిర్ణయం తీసుకుంటామని అస్ఘర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. -
దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ
-
దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ
అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు. ఒక షార్ప్ షూటర్, మరో ముగ్గురిని పోలీసులు రాజ్‌కోట్ నగర శివార్లలో అరెస్టు చేశారు. దావూద్ సోదరుడు అనీస్ సూచనల మేరకు వాళ్లు ఇక్కడికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం తరఫు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునే అనీస్ ఇబ్రహీం.. జామ్‌నగర్ వ్యాపారవేత్తను చంపేందుకు రామ్‌దాస్ రహానే, మరో ముగ్గురికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వాళ్లు ముగ్గురూ ఓ ప్రైవేటు బస్సులో వస్తున్నారని, కన్స్ట్రక్షన్ కంపెనీ నడిపే వ్యాపారి అష్ఫఖ్ ఖత్రీ వాళ్ల టార్గెట్ అని రాజ్‌కోట్ డీసీసీ ఎస్ఆర్ ఒడెదరా చెప్పారు. ఆయన నేతృత్వంలోని పోలీసు బృందం షూటర్లను పట్టుకుంది. ఖత్రీని వాళ్లు టార్గెట్ చేసిన విషయం తెలిసి రాజ్‌కోట్ - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కువదవా పట్టణంపై తాము గట్టిగా దృష్టిపెట్టామని, మహారాష్ట్ర నుంచి నలుగురు వ్యక్తులు ఒక ప్రైవేటు బస్సులో అనుమానాస్పదంగా వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఒడెదరా తెలిపారు. బస్సులో నలుగురు అలాగే కనిపించారని, వాళ్ల లగేజి చెక్ చేస్తే అందులో ఒక పిస్టల్, ఆరు లైవ్ కార్ట్రిడ్జులు, రెండు కత్తులు, గుజరాత్, మహారాష్ట్ర పేర్లతో ఉన్న నకిలీ నంబర్ ప్లేట్లు దొరికాయని వివరించారు. రామదాస్ అనే వ్యక్తి దావూద్ గ్యాంగు తరఫున కాంట్రాక్టు కిల్లర్‌గా వ్యవహరిస్తాడని, అతడిపై మహారాష్ట్రలో పలు ఆరోపణలున్నాయని చెప్పారు. దావూద్ గ్యాంగు వీళ్లకు పది లక్షలకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ముందుగా ఏదో ఒక వాహనం దొంగిలించి, దానికి నకిలీ నంబర్ ప్లేటు పెట్టి ఇక్కడ పని పూర్తయ్యాక అందులోనే మహారాష్ట్ర వెళ్లిపోవాలనుకున్నారని, అందుకే ఆ ప్లేట్లు తెచ్చారని తెలిపారు. -
ఎన్ గ్యాంగ్ ఇదే!
* షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లతో జట్టుకట్టిన నయీమ్ * ముఠాలో మెజారిటీ నల్లగొండ జిల్లా వారే.. కీలకపాత్ర కుటుంబ సభ్యులది * ప్లాన్ వేసేది ఒకరు.. చంపేది మరొకరు.. లొంగిపోయేది ఇంకొకరు సాక్షి, హైదరాబాద్: భూదందాలు.. సెటిల్మెంట్లు.. బెదిరింపులు.. హత్యలు. సామాన్యులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు.. చివరికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులైనా సరే నయీమ్ గ్యాంగ్ లెక్క చేయదు. ఎవరైనా తమ మాట వినాల్సిందే. బెదిరించడం.. వినకపోతే కొట్టడం.. కాలో, చెయ్యో విరగ్గొట్టడం.. వినకపోతే చంపేందుకూ వెనుకాడకపోవడం గ్యాంగ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. ఏదై నా పక్కాగా ఉంటుంది. ఒకరు ప్లాన్ చేస్తారు.. మరొకరు వెళ్లి అమలుపరుస్తారు.. పోలీసు కేసయితే ఇంకొకరు వెళ్లి లొంగిపోతారు. అసలు వారికి నేరారోపణపై జైలుకు వెళ్లే వారికి సంబంధమే ఉండదు. ఈ ముఠాలో షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లు ఉంటారు. జెడ్పీటీసీల నుంచి కౌన్సెలర్ల వరకు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నయీమ్ కుటుంబ సభ్యులు కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు. మొత్తంగా నయీమ్ గ్యాంగ్‌లో ఎక్కువగా నల్లగొండ జిల్లాకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న అరెస్టులు, సోదాల్లో వెలుగు చూస్తున్న అంశాల ఆధారంగా చూస్తే.. నయీమ్ గ్యాంగ్ చాలా పకడ్బందీగా ఉందని వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్-గ్యాం గ్లో కీలక సభ్యులెవరు? వారి నేపథ్యమేమిటి? ఏం చేస్తుంటారనే దానిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వర్గాల ద్వారా తెలుస్తున్న వివరాలివి.. శేషన్న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. నయీమ్‌కు రైట్‌హ్యాండ్. గ్యాంగ్‌లో తర్వాతి లీడర్. నయీమ్‌తో కలసి శేషన్న స్కెచ్ వేశాడంటే తిరుగులేనట్టే. ఎన్కౌంటర్ తర్వాత శేషన్న పరారీలో ఉన్నాడు. సలీమా నయీమ్ దందాల్లో సలీమాది ప్రధాన పాత్ర. భువనగిరికి చెందిన ఆమె నయీమ్‌కు సోదరి. పలు యాక్షన్లకు స్కెచ్ వేసేది కూడా ఆమేనని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే ఆమెను అరెస్టు చేశారు. షకీల్ భువనగిరిలో నయీమ్‌కు ప్రధాన అనుచరుడు. పలు కిరాయి హత్యల్లో స్వయంగా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లాడు. వ్యాపారులను చంపుతానని బెదిరించడంలో దిట్ట. షకీల్‌పై పీడీ యాక్టు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. రెండు నెలల క్రితం శవమై ఇంటికి చేరాడు. అతడి భార్య జైనబున్నీసాబేగం ప్రస్తుత మున్సిపాలిటీలో కౌన్సెలర్, టీడీపీ నుంచి ఏకగ్రీవంగా గెలిచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. పాశం శ్రీను భువనగిరిలో నయీమ్‌కు మరో ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ పాశం శ్రీను. రియల్టర్లను, వ్యాపారులను గుర్తించి వారిని నయీమ్ వద్దకు తీసుకెళ్లడం, ఒప్పుకున్న మొత్తాన్ని వసూలు చేయడం ఇతడి పని. టీడీపీ నుంచి గతంలో కౌన్సెలర్‌గా గెలుపొందాడు. పీడీ యాక్టు నమోదు కావడంతో ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. ఎండీ నాసర్ నయీమ్ మరో ప్రధాన అనుచరుడు ఎండీ నాసర్. స్థానికంగా సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. షకీల్, పాశం శ్రీనులతో సమానమైన స్థానం ఇతనిది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలను నడుపుతాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చే స్తాడు. సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. ప్రస్తుత మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సెలర్ గా గెలిచి టీఆర్ఎస్లో చేరాడు. అక్రమ అయుధాలు కలిగి ఉన్న కేసులో జైల్లో ఉన్నాడు. ఫహీమ్ నయీమ్ చిన్నమ్మ కొడుకు ఫహీమ్ది సంస్థాన్ నారాయణపురం. న యీం సోదరి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. అతని స్నేహితులంతా నయీమ్ వెంట తిరుగుతూ ఉండేవారు. పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన నీళ్ల శ్రీధర్‌గౌడ్, పున్న బలరాంలు కూడా ఫహీమ్ స్నేహితులే. ఫహీమ్ ఎనిమిదేళ్ల క్రితం వరకు చౌటుప్పల్ మండలం డి.నాగారంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా ముంబై సిట్ పోలీసులు గతంలో అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో దాదాపు 40మంది వరకు ఇలాంటి అనుచరులున్నారు. సందెల సుధాకర్ నయీమ్ మరో అనుచరుడు సందెల సుధాకర్. పీడీ యాక్టు కింద వరంగల్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసాడు. శ్రీహరి హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నయీమ్‌కు చెందినదిగా బయటపడ్డ 67 ఎకరాల భూమి శ్రీహరి పేరున ఉన్నట్టు సమాచారం. శ్రీహరి కూడా సంస్థాన్ నారాయణపురం వాసి అని చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్టలోనూ వందల ఎకరాల్లో చేసిన వెంచర్లను ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెబుతున్నారు. టమాటా శ్రీను హాలియాకు చెందిన శ్రీను నల్లగొండ పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తాడు. టమాటా శ్రీనుగా గుర్తింపు పొందాడు. పేకా ట, సింగిల్ నంబర్ లాటరీ, భూసెటిల్మెంట్లు చేస్తాడు. పేరు కోసం నయీమ్‌కు ముఖ్య అనుచరుడిగా చలామణి అయిన యూసుఫ్ వెంట తిరిగాడు. యూసుఫ్ సొంతంగా సెటిల్మెంట్లు చేస్తుండటంతో నయీమ్ ముఠానే హత్య చేసింది. ఆ తర్వాత శ్రీను నయీమ్ సోదరికి అనుచరుడిగా మారాడు. మండలానికో ఇన్చార్జి నయీమ్ తన నేర సామ్రాజ్యంలో మండలానికో ఇన్చార్జిని నియమించుకున్నాడు. వారు ఆ మండలంలో బాగా రియల్ వ్యాపారం చేసే వారిని, బాగా డబ్బు సంపాదించే వారిని గుర్తించి నయీమ్‌కు సమాచారం ఇవ్వాలి. వీరితో పాటు నయీమ్ సోదరి, అత్త, బావమరిది.. ఇలా ఆయన కుటుంబ సభ్యులంతా గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించేవారు.