తుపాకీ అవ్వలు | Sharp shooters at the age of 80 in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

తుపాకీ అవ్వలు

Published Tue, Apr 23 2019 12:05 AM | Last Updated on Tue, Apr 23 2019 5:07 AM

Sharp shooters at the age of 80 in Uttar Pradesh - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో 80 ఏళ్ల వయసులో కూడా షార్ప్‌ షూటర్లు రాణించి వందల కొద్దీ మెడల్స్‌ గెలుస్తున్న చంద్రు తోమర్, ప్రకాషి తోమర్‌లపై ఇప్పుడు సినిమా సిద్ధమవుతోంది.

అరవై ఏళ్లు దాటితే కృష్ణా రామా అనుకోవాలని ఈ సంఘం ఒక ఆనవాయితీని విధించి ఉంది. ఇక స్త్రీలు అరవై దాటాక మనవలు మనవరాళ్లను చూసుకుంటూ ఏదో ఒక మగతోడు లేకుండా గడప దాటే వీలు లేకుండా ఉండాలని కూడా సంఘం భావిస్తుంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు అవ్వలు ఈ ఆనవాయితీని భగ్నం చేశారు. వారు కూరగాయలు కోసే కత్తిని, కత్తి పీటను వదిలి ఏకంగా తుపాకిని పట్టుకున్నారు. షార్ప్‌ షూటర్‌లు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వందలకొద్దీ మెడల్స్‌ సంపాదిస్తున్నారు. మెడల్స్‌ వల్ల వారి వ్యక్తిగత కీర్తి పెరిగి ఉండవచ్చు. కాని వారు చేస్తున్న ఈ పని వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడపిల్లల ధైర్యం పెరిగింది. వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. మగాళ్ల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదని వారు కూడా రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకుంటున్నారు. ఇది వారి ఆత్మ విశ్వాసానికే కాదు అవసరమైతే ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతోంది.

బుల్లెట్టు ఇలా దిగింది
ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంత జిల్లా అయిన భాగ్‌పట్‌లోని చిన్న ఊరు జొహ్రీ. ఆ ఊరులోని అందరిలాంటి గృహిణి చంద్రు తోమార్‌. అప్పటికి ఆమె వయసు 65. ఎనిమిది మంది పిల్లలు, 15 మంది మనమలు, మనమరాళ్లు. ఆ ఊళ్లో రైఫిల్‌ క్లబ్‌ ఉంది. అయితే ఎక్కువగా అబ్బాయిలే అక్కడ ప్రాక్టీసు చేస్తుంటారు. కాని చంద్రు మనుమరాలు ఆ క్లబ్‌లో చేరాలనుకుంది. ఒక్కత్తే వెళ్లడానికి కొంచెం బిడియపడి నానమ్మను తోడు రమ్మంది. మనవరాలికి తోడుగా రెండు రోజులు వెళ్లిన చంద్రు అక్కడ ప్రాక్టీసులో మనవరాలు పడుతున్న తిప్పలు చూసి ‘అలా కాదు ఇలా కాల్చాలి తుపాకిని’ అని కోచ్‌ చెప్పినదాన్ని బట్టి కాల్చి చూపింది. ఆశ్చర్యం. అది నేరుగా వెళ్లి గురిని తాకింది. కోచ్‌ ఆశ్చర్యపోయి, ఇది పొరపాటున తగిలిందేమోనని మళ్లీ కాల్చమన్నాడు. చంద్రు సరిగ్గా మళ్లీ గురి తగిలేలా కాల్చింది. బాగా ప్రాక్టీసు ఉన్న పిల్లల కంటే చంద్రు గురి ఎక్కువగా గ్రహించిన కోచ్‌ ఆమెను షార్ప్‌ షూటర్‌గా ట్రైనింగ్‌ తీసుకోమన్నాడు. కాని ఆ వెనుకబడిన ప్రాంతంలో అలాంటి పని ఆ వయసులో చేయడానికి అనుమతి లేదు. అందుకని వారానికి ఒకసారి వచ్చి చంద్రు ప్రాక్టీసు చేసేది. ఇంట్లో ఎవరూ చూడకుంటే చేతిలో పట్టుకోసం జగ్గులో నీళ్లు నింపి తుపాకీని పట్టుకుని నిలుచున్నట్టు నిలుచునేది. ఆమె కంటి చూపు బాగుండటం, చేతిలో పట్టు ఉండటంతో ఆమె గురి తప్పని షూటర్‌గా కొద్ది రోజులలోనే అవతరించింది. వయోజనుల క్రీడా పోటీలకు తీసుకు వెళితే మెడల్‌తో తిరిగి వచ్చేది. మొదట ఆమె భర్త అభ్యంతరం చెప్పాడు. కాని ఊళ్లో ఆమెకు వస్తున్న పేరు, గుర్తింపు చూసి అతను కూడా ప్రోత్సహించసాగాడు. ఇది చూసి ఆమె ఆడపడుచు ప్రకాషి తోమార్‌కు కూడా ఆసక్తి కలిగింది. ఆమె కూడా తన వదిన చంద్రుతో కలిసి షూటింగ్‌ను ప్రాక్టీస్‌ చేసింది. ఇద్దరూ అనతికాలంలోనే ఆ ప్రాంతంలో ‘షూటర్‌ దాదీస్‌’ (తుపాకీ అవ్వలు)గా ఖ్యాతి పొందారు. ఇప్పుడు చంద్రు వయసు 87. ప్రకాషి వయసు 82. అయినప్పటికీ లక్ష్యం చేరుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తున్నారు.

సినిమాగా ఇద్దరి కథ
గత పది పదిహేను ఏళ్లలో దేశమంతా స్ఫూర్తినింపిన ఈ కథ ఎట్టకేలకు బాలీవుడ్‌కు చేరింది. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనే నిర్మాతగా మారి వీరి కథను తెరకెక్కిస్తున్నాడు. సినిమా పేరు ‘సాండ్‌ కీ ఆంఖ్‌’. తెలుగువారికి సుపరిచితురాలైన తాప్సీ, ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ’లో నటించిన భూమి పెడ్నెకర్‌ ఈ ఇద్దరు అవ్వల పాత్రలను పోషిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రొస్థెటిక్స్‌ పద్ధతిలో మేకప్‌ వేసుకుంటున్నారు. ఈ మేకప్‌ వల్ల, షూటింగ్‌లోని ఎండల వల్ల నటి భూమి ముఖం మీద రాషెస్‌ వచ్చేశాయి. అయినప్పటికీ ఈ పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడతాను అంటూ భూమి పేర్కొంది. తుషార్‌ హీరానందానీ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు హర్యాణ్వి గ్రామీణ జీవితంలో స్త్రీల మనోభావాలు, మగ పెత్తనం, దానిని దాటి స్త్రీలు తమ ఉనికిని చాటుకోవడం ఈ కథ. స్ఫూర్తిదాయకమైన నిజ జీవితాలు గతంలో పత్రికలకెక్కడమే గొప్పగా ఉండేది. కాని ఇవాళ అవి ఏకంగా సినిమాలే అవుతున్నాయి. దీపావళికి రిలీజయ్యి ఎడాపెడా పేలనున్న ఈ తుపాకీ చప్పుళ్లను విని గురి తప్పని చప్పట్లు మనం కూడా కొడదాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement