* షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లతో జట్టుకట్టిన నయీమ్
* ముఠాలో మెజారిటీ నల్లగొండ జిల్లా వారే.. కీలకపాత్ర కుటుంబ సభ్యులది
* ప్లాన్ వేసేది ఒకరు.. చంపేది మరొకరు.. లొంగిపోయేది ఇంకొకరు
సాక్షి, హైదరాబాద్: భూదందాలు.. సెటిల్‌మెంట్లు.. బెదిరింపులు.. హత్యలు. సామాన్యులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు.. చివరికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులైనా సరే నయీమ్ గ్యాంగ్ లెక్క చేయదు. ఎవరైనా తమ మాట వినాల్సిందే.
బెదిరించడం.. వినకపోతే కొట్టడం.. కాలో, చెయ్యో విరగ్గొట్టడం.. వినకపోతే చంపేందుకూ వెనుకాడకపోవడం గ్యాంగ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. ఏదై నా పక్కాగా ఉంటుంది. ఒకరు ప్లాన్ చేస్తారు.. మరొకరు వెళ్లి అమలుపరుస్తారు.. పోలీసు కేసయితే ఇంకొకరు వెళ్లి లొంగిపోతారు. అసలు వారికి నేరారోపణపై జైలుకు వెళ్లే వారికి సంబంధమే ఉండదు. ఈ ముఠాలో షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లు ఉంటారు. జెడ్పీటీసీల నుంచి కౌన్సెలర్ల వరకు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
నయీమ్ కుటుంబ సభ్యులు కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు. మొత్తంగా నయీమ్ గ్యాంగ్‌లో ఎక్కువగా నల్లగొండ జిల్లాకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత జరుగుతున్న అరెస్టులు, సోదాల్లో వెలుగు చూస్తున్న అంశాల ఆధారంగా చూస్తే.. నయీమ్ గ్యాంగ్ చాలా పకడ్బందీగా ఉందని వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్-గ్యాం గ్‌లో కీలక సభ్యులెవరు? వారి నేపథ్యమేమిటి? ఏం చేస్తుంటారనే దానిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వర్గాల ద్వారా తెలుస్తున్న వివరాలివి..
శేషన్న
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. నయీమ్‌కు రైట్‌హ్యాండ్. గ్యాంగ్‌లో తర్వాతి లీడర్. నయీమ్‌తో కలసి శేషన్న స్కెచ్ వేశాడంటే తిరుగులేనట్టే. ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న పరారీలో ఉన్నాడు.
సలీమా
నయీమ్ దందాల్లో సలీమాది ప్రధాన పాత్ర. భువనగిరికి చెందిన ఆమె నయీమ్‌కు సోదరి. పలు యాక్షన్‌లకు స్కెచ్ వేసేది కూడా ఆమేనని సమాచారం. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే ఆమెను అరెస్టు చేశారు.
షకీల్
భువనగిరిలో నయీమ్‌కు ప్రధాన అనుచరుడు. పలు కిరాయి హత్యల్లో స్వయంగా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లాడు. వ్యాపారులను చంపుతానని బెదిరించడంలో దిట్ట. షకీల్‌పై పీడీ యాక్టు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. రెండు నెలల క్రితం శవమై ఇంటికి చేరాడు. అతడి భార్య జైనబున్నీసాబేగం ప్రస్తుత మున్సిపాలిటీలో కౌన్సెలర్, టీడీపీ నుంచి ఏకగ్రీవంగా గెలిచి ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు.
పాశం శ్రీను
భువనగిరిలో నయీమ్‌కు మరో ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ పాశం శ్రీను. రియల్టర్లను, వ్యాపారులను గుర్తించి వారిని నయీమ్ వద్దకు తీసుకెళ్లడం, ఒప్పుకున్న మొత్తాన్ని వసూలు చేయడం ఇతడి పని. టీడీపీ నుంచి గతంలో కౌన్సెలర్‌గా గెలుపొందాడు. పీడీ యాక్టు నమోదు కావడంతో ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు.
ఎండీ నాసర్
నయీమ్ మరో ప్రధాన అనుచరుడు ఎండీ నాసర్. స్థానికంగా సెటిల్‌మెంట్లు చేయడంలో దిట్ట. షకీల్, పాశం శ్రీనులతో సమానమైన స్థానం ఇతనిది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలను నడుపుతాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చే స్తాడు. సెటిల్‌మెంట్‌లు చేయడంలో దిట్ట. ప్రస్తుత మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సెలర్ గా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరాడు. అక్రమ అయుధాలు కలిగి ఉన్న కేసులో జైల్లో ఉన్నాడు.
ఫహీమ్
నయీమ్ చిన్నమ్మ కొడుకు ఫహీమ్‌ది సంస్థాన్ నారాయణపురం. న యీం సోదరి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. అతని స్నేహితులంతా నయీమ్ వెంట తిరుగుతూ ఉండేవారు. పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన నీళ్ల శ్రీధర్‌గౌడ్, పున్న బలరాంలు కూడా ఫహీమ్ స్నేహితులే. ఫహీమ్ ఎనిమిదేళ్ల క్రితం వరకు చౌటుప్పల్ మండలం డి.నాగారంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ విచారణ సందర్భంగా ముంబై సిట్ పోలీసులు గతంలో అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో దాదాపు 40మంది వరకు ఇలాంటి అనుచరులున్నారు.
సందెల సుధాకర్
నయీమ్ మరో అనుచరుడు సందెల సుధాకర్. పీడీ యాక్టు కింద వరంగల్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసాడు.
శ్రీహరి
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నయీమ్‌కు చెందినదిగా బయటపడ్డ 67 ఎకరాల భూమి శ్రీహరి పేరున ఉన్నట్టు సమాచారం. శ్రీహరి కూడా సంస్థాన్ నారాయణపురం వాసి అని చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్టలోనూ వందల ఎకరాల్లో చేసిన వెంచర్లను ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెబుతున్నారు.
టమాటా శ్రీను
హాలియాకు చెందిన శ్రీను నల్లగొండ పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తాడు. టమాటా శ్రీనుగా గుర్తింపు పొందాడు. పేకా ట, సింగిల్ నంబర్ లాటరీ, భూసెటిల్‌మెంట్లు చేస్తాడు. పేరు కోసం నయీమ్‌కు ముఖ్య అనుచరుడిగా చలామణి అయిన యూసుఫ్ వెంట తిరిగాడు. యూసుఫ్ సొంతంగా సెటిల్‌మెంట్లు చేస్తుండటంతో నయీమ్ ముఠానే హత్య చేసింది. ఆ తర్వాత శ్రీను నయీమ్ సోదరికి అనుచరుడిగా మారాడు.
మండలానికో ఇన్‌చార్జి
నయీమ్ తన నేర సామ్రాజ్యంలో మండలానికో ఇన్‌చార్జిని నియమించుకున్నాడు. వారు ఆ మండలంలో బాగా రియల్ వ్యాపారం చేసే వారిని, బాగా డబ్బు సంపాదించే వారిని గుర్తించి నయీమ్‌కు సమాచారం ఇవ్వాలి. వీరితో పాటు నయీమ్ సోదరి, అత్త, బావమరిది.. ఇలా ఆయన కుటుంబ సభ్యులంతా గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించేవారు.
ఎన్ గ్యాంగ్ ఇదే!
Published Fri, Aug 12 2016 2:23 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement
Advertisement