వాస్తు తప్ప ‘గ్రహణం’ పట్టించుకోరా?
సీఎం కేసీఆర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్న
చంద్రగ్రహణం రోజు కృష్ణా ట్రయల్ రన్ ఏమిటని విమర్శ
అమీర్‌పేట: హిందువుల ఆచారం ప్రకారం గ్రహణం అనేది శుభకార్యాలకు మంచిదికాదని ఆస్థాన పండితులు చెబుతున్నా..సీఎం కేసీఆర్ పట్టుదలకు పోయి కృష్ణాజలాల అనుసంధానం పనులు చంద్రగ్రహణం రోజునే చేయించడం దురదృష్టకరమని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శనివారం అమీర్‌పేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయానికి వాస్తు సరిగ్గాలేదని దానిని వేరేచోటుకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్...మరి గ్రహణం రోజు కృష్ణాజలాల అనుసంధానం పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషి వల్లే నగరానికి కృష్ణాజలాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
పండుగ పూట నీటిపరఫరా నిలిపివేస్తారా?
మంచినీటి వినియోగం ఎక్కువగా ఉన్న హనుమజ్జయంతి, ఈస్టర్ పండుగ నాడు పనుల పేరుతో నీటిపరఫరాను నిలిపివేయడం సరికాదని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పండుగలను దృష్టిలో పెట్టుకుని రెండురోజులు పనులను వాయిదా వేయాలని స్వయంగా హోంమంత్రి, జలమండలి ఎండీని కలిసి కోరినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ప్రజల మేలుకోసం ఎవరైనా మంచి సలహలు ఇస్తే స్వీకరిస్తానని చెబుతున్న సీఎం మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. కృష్ణాజలాల రెండవదశ పనులను వేగవంతంగా పూర్తి చేయించింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, మూడవదశ విషయంలో తాను, పీజేఆర్ కలిసి అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.