తల ముందుకుపెట్టి.. స్వర్ణం కొట్టేసింది!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. బహమాయికి చెందిన స్ప్రింటర్ షాన్ మిల్లర్ ఊహించని విధంగా తలను ముందుగా లైన్‌పై పెట్టి పసిడిని సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన 400 మీటర్ల రేసులో మిల్లర్ అందరికంటే ముందు లైన్‌పై డైవ్ కొట్టి మరీ స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఈ రేసు మొదలయ్యాక అమెరికా స్ప్రింటర్ అలైసన్ ఫెలిక్స్, మిల్లర్లు హోరీహోరీగా తలపడ్డారు. అయితే 398 మీటర్ల వరకూ ఈ ఇద్దరూ సరిసమానం పరుగెత్తగా, చివర్లో మిల్లర్ డైవ్ చేసి తన తలను ముందు లైన్‌పై ఉంచి విజేతగా నిలిచింది. దీంతో ఒలింపిక్స్ లో ఐదో స్వర్ణం సాధించాలనుకున్న అలైస్ ఫెలిక్స్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిద్దరూ రేసును పూర్తి చేసే క్రమంలో వారి మధ్య వ్యవధి 0.07 సెకండ్లుగా నమోదు కావడం గమనార్హం. అయితే మిల్లర్ ఇలా డైవ్ కొట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం రియో ఒలింపిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఇలా తల ముందుకు పెట్టి గెలిచిన వాళ్లు ఎవరూ లేరని.. ఈ తరహాలో గెలవడం ఇదే మొదటిసారని అంటున్నారు.