బరిలోకి ప్రణబ్, షీలాల తనయులు
ఎన్నికల అరంగేట్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్మిష్ట ముఖర్జీ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి, లతికా దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.
గ్రేటర్ కైలాష్ నుంచి..శర్మిష్ట ముఖర్జీ
గ్రేటర్ కైలాష్ నుంచి పార్టీ తనకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మరొకరికి టికెట్ ఇచ్చినా తాను ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమని కూడా ఆమె చెప్పారు. పార్టీకి గ్రేటర్ కైలాష్ సీటు గెలిచిపెట్టడమే తన ఉద్దేశమని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ గెలిచారు. ఆయన బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రాను ఓడించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నుంచి మాజీ మేయర్లు ఆర్తీ మెహ్రాకు గానీ, సరితా చౌదరికి గానీ టికెట్ ఇవ్వవచ్చు. సౌరభ్ భరద్వాజ్‌కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు ఆప్ ఇదివరకే ప్రకటించింది.
పలు ఉద్యమాల్లో ..
శర్మిష్ట ముఖర్జీ ఈ సంవత్సరమే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు, ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలంకరణ కోసం కేటాయించిన పార్కులలో తమకు ఆడుకునే హక్కు ఉందని డిమాండ్ చేస్తూ దక్షిణ ఢిల్లీలోని పిల్లలు ప్రారంభించిన గివ్ బ్యాక్ అవర్ ప్లేగ్రౌండ్స్ ఉద్యమానికి కూడా ఆమె చేయూత నందిస్తున్నారు.
న్యూఢిల్లీ నుంచి లతికా దీక్షిత్..
న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తె లతికా దీక్షిత్ సయ్యద్‌ను నిలబెట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న లతికా దీక్షిత్‌ను ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సోదరుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా ఈ నియోజకవర్గం నుంచి లతికా దీక్షిత్‌ను నిలబెట్టడానికి సముఖంగా ఉందని అంటున్నారు.
లతికా పిన్న వయస్కురాలు అయినప్పటికీ షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాల కారణంగా న్యూఢిల్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి మళ్లీ పోటీ చేస్తారని ఆప్ అంటుండగా, తాను కూడా న్యూఢిల్లీ నుంచే పోటీ చేస్తానని ఆప్ తిరుగుబాటు నేత, లక్ష్మీనగర్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు.