వాళ్లు ఎలా కలిశారు?.. ఎవరు విడదీశారు?
ముంబై: రాహుల్ ముఖర్జీయా, షీనా బోరా విధివంచిత ప్రేమికులు. వారు ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత విషాదకర పరిస్థితుల్లో ఎలా వేరయ్యారు? 2012లో షీనాబోరా దారుణ హత్యకు ముందు జరిగిన సంఘటనలేమిటి? అప్పటి పరిణామాలన్నింటినీ రాహుల్ ముఖర్జీయా పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. తమ ప్రేమబంధం గురించి తెలుసుకొని షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తీవ్రంగా నిస్పృహకు లోనైందని తెలిపాడు. అకస్మాత్తుగా షీనాబోరా కనిపించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని, ఆమె మిస్సింగ్ వెనుక ఇంద్రాణి ప్రమేయం ఉండవచ్చునని అనుమానించానని రాహుల్ చెప్పాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన హంతకురాలిగా మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయా రెండో భార్య ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తొలిసారి ఎప్పుడూ కలిశారు?
2008లో రాహుల్ ముంబై వర్లిలోని మార్లో అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తండ్రి పీటర్ ముఖర్జీయా నివాసానికి మారాడు. అప్పడే షీనాను తొలిసారి చూశాడు. 'వర్లీ ఫ్లాట్‌లోనే నేను తొలిసారి షీనాను చూశాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకున్నాం. ఇది మా మధ్య సన్నిహిత స్నేహాన్ని ఏర్పరిచింది' అని రాహుల్ పోలీసులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత నెల రోజులకే తాను లండన్ వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు ఉండిన తర్వాత మళ్లీ ముంబై వచ్చానని చెప్పాడు. అయితే ఈసారి ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండాలని పీటర్‌తో ఇంద్రాణి చెప్పించిందని, దీంతో తాను ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నానని తెలిపాడు.
మొదటిసారి అప్పుడే చెప్పింది..!
యావత్ ప్రపంచం అనుకుంటున్నట్టు తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఆమె కూతురినని ఓరోజు స్వయంగా షీనాబోరానే చెప్పిందని రాహుల్ పోలీసులకు తెలిపాడు. 'నా తండ్రి సహకారంతో నేను ప్రైమ్ ఫొకస్లో ఉద్యోగం సంపాదించాను. షీనాను కూడా తరచూగా కలుస్తుండేవాణ్ని. క్రమంగా మేం ప్రేమలో పడిపోయాం. ఒక రోజు తను వచ్చి 'నేను ఇంద్రాణి చెల్లెల్ని కాదు కూతరిని' అని చెప్పింది. మా అనుబంధం గురించి ఇంద్రాణికి తెలియడంతో తను కోపాద్రిక్తురాలైంది. ఈ విషయమై నా తండ్రితో తను కోట్లాడింది. వెంటనే షీనాను గువాహటి పంపించింది' అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2009లో షీనాను ఢిల్లీకి పంపించారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో తను ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారు.
ఆ తర్వాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు బెంగళూరు వచ్చిన షీనా బోరా.. ఇంద్రాణి మాజీ ప్రియుడితో కొంతకాలం ఉంది. 'ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లోని వస్తువులన్ని అమ్మి బెంగళూరు వెళ్లి షీనాను కలుసుకున్నాను. ఆమె తన చాలా బలహీనంగా ఉంది. మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే ఔషధాలను వేసుకోమని ఇంద్రాణి షీనాకు ఇచ్చింది. ఆ ఔషధాలను వైద్యుడికి చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని మాకు సూచించాడు. ఆ మందులు తీసుకోవడం మానిన తర్వాత ఆమె కోలుకుంది. షీనా తాత-నాయనమ్మ, మా అమ్మ అనుమతి తీసుకొని ఆమెను డెహ్రాడూన్‌లోని మా ఇంటికి తీసుకెళ్లాను' అని రాహుల్ తెలిపాడు.
ఆ తర్వాత 2009 చివర్లో ఈ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. షీనాకు ఉద్యోగం దొరికింది. అంధేరిలోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు మకాం వేశారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. 2011 అక్టోబర్‌లో రాహుల్, షీనా డెహ్రాడూన్ వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత-నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో ఈ నిశ్చితార్థం జరిగింది. వారు మళ్లీ ముంబైకి రావడంతో నిశ్చితార్థం గురించి ఇంద్రాణికి తెలిసింది. ఈ సమయంలో ఆమె ఎంతో మారిన మనిషిలా కనిపించిందని రాహుల్ తెలిపాడు.
షీనా ఎలా అదృశ్యమైంది?
ఆ తర్వాత ఓసారి ఇంద్రాణి షీనాను డిన్నర్‌కు పిలిచింది. షీనా హత్యకు ముందురోజు కూడా ఆమెను ఇంద్రాణి డిన్నర్‌కు పిలిచింది. షీనాకు నిశ్చితార్థం కానుక ఇస్తానని చెప్పింది. హత్యకు ముందు రోజు 2012, ఏప్రిల్ 24న షీనాను నేను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు ఇంద్రాణి పదేపదే ఫోన్ చేసింది. షీనా రావడానికి ఎంత సమయం తీసుకుంటుందని పదేపదే అడిగింది. ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన అడ్రస్‌కు మేం వెళ్లాం. అక్కడికి షెవ్రోలె కారులో ఇంద్రాణి, మరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. డ్రైవర్ సీటులో శ్యామ్రాయ్ ఉన్నాడు' అని రాహుల్ వివరించాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అని తేలింది. ఆ తర్వాత షీనా ఇక ఎప్పటికీ కనిపించలేదని, ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన మొబైల్ నుంచి ఓ మెసెజ్ వచ్చిందని, తాను కొత్త ప్రేమికుడిని చూసుకున్నానని, అతనితో ఆనందంగా ఉన్నానని ఆ మెసెజ్‌లో పేర్కొని ఉందని రాహుల్ చెప్పాడు. షీనా మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వివరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యాంరావులకు వ్యతిరేకంగా రాహుల్ వాంగ్మూలం ఇచ్చాడు.
పీటర్ పాత్ర ఏమిటి?
షీనా హత్యకేసులో పీటర్ ముఖర్జీయా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీనా హత్య కుట్ర పీటర్‌కు తెలుసని పేర్కొంటూ సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అయితే రాహుల్ మాత్రం ఒక్కసారి మాత్రమే తన వాంగ్మూలంలో పీటర్ పేరు ప్రస్తావించాడు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలుపలేదని తెలుస్తున్నది. పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లోని ఈ వివరాలను మిడ్డే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది.