చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలు!
జగదేవపూర్: ఎప్పటిలాగే ఓ గొర్రెల కాపరి తన గొర్రెల మందతో అడవికి వెళ్లాడు. ఆ ప్రాంతమంతా గుట్టలమయం. ఎటూ చూసినా గంభీరంగా కనిపించే ప్రాంతం. రోజూ అదే ప్రాంతానికి వెళుతుండటంతో తనకు అంతగా భయమనించలేదు కాబోలు.. కానీ అనుకోకుండా తనకు చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలు కనిపించాయి. అందులోనూ యువతుల మృతదేహాలు కుళ్లిపోయి ఉండటంతో గొర్రెల కాపరి బెదిరిపోయాడు. ఈ ఘటన ఎక్కడో కాదు... మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం కొండపోచమ్మ గుట్టల్లో సోమవారం వెలుగుచూసింది.
గుర్తు తెలియని ఇద్దరు యువతుల మృతదేహాలు క్షీణించిన స్థితికి చేరాయి. గొర్రెల కాపరి గౌస్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వడంతో బయటకు వచ్చింది. డీఎస్పీ శ్రీధర్ సహా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు యవతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని సమాచారం. కేవలం వస్త్రాలు, లోపల అస్తిపంజరాలు మాత్రమే మిగలడంతో మృతి చెంది చాలా రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.