చెలరేగిన చెన్నై
ఢిల్లీపై 93 పరుగుల ఘనవిజయం
84 పరుగులకే కుప్పకూలిన డేర్‌డెవిల్స్
తమ తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ దాడికి చిన్నబోయిన చెన్నై.. ఢిల్లీపై జూలు విదిల్చింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లు... అందరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో ధోనిసేన లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7లో మాజీ చాంపియన్ చెన్నై సూసర్ కింగ్స్ ఖాతా తెరిచింది. పంజాబ్ జట్టు చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు... సమష్టి ఆటతీరుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. సోమవారం షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 177 పరుగులు సాధించింది. సురేశ్ రైనా (41 బంతుల్లో 56; 5 ఫోర్లు; 1 సిక్స్) సమయోచిత ఆటతీరుతో అర్ధ సెంచరీ చేశాడు. చివర్లో కెప్టెన్ ఎంఎస్ ధోని (15 బంతుల్లో 32; 2 ఫోర్లు; 2 సిక్స్‌లు) వేగంగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించేలా చూశాడు.
ఓపెనర్ డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 29; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఉనాద్కట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. కార్తీక్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు), నీషమ్ (15 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఈశ్వర్ పాండే, జడేజా, అశ్విన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనాకి దక్కింది.
నిదానంగా ఆరంభించినా...
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై జట్టు తమ ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. మెకల్లమ్ (9) అవుట్‌కావడంతో... పవర్‌ప్లే ఆరు ఓవర్లలో జట్టు 34 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆ తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. అడపాదడపా బౌండరీలు వెళ్లినా ఎక్కువగా సింగిల్స్‌పైనే దృష్టి పెట్టారు. రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం తర్వాత... 11వ ఓవర్లో డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 29; 3 ఫోర్లు)ను నదీమ్ బౌల్డ్ చేశాడు.ఆ తర్వాతి ఓవర్లో రైనా మూడు ఫోర్లు బాది టచ్‌లోకొచ్చాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కొద్దిసేపటికే భారీ షాట్‌కు యత్నించి బౌండరీ దగ్గర విజయ్‌కు చిక్కాడు.
దోని రాకతో ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదాడు. అటు డు ప్లెసిస్ (17 బంతుల్లో 24; 1 ఫోర్; 1 సిక్స్) కూడా ఉన్నంత సేపు బ్యాట్‌ను ఝుళిపించాడు. వీరిద్దరు వరుస ఓవర్లలో వెనుదిరిగారు. చివర్లో మిథున్ మిన్హాస్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడాడు.
టపటపా వికెట్లు
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏమాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. ప్రారంభంలోనే చెన్నై ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లతో అదరగొట్టారు. మయాంక్ అగర్వాల్ (2) క్యాచ్‌ను... రైనా పరిగెత్తుతూ ఎడమ వైపు డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఆ తర్వాత డుప్లెసిస్.. .విజయ్, తివారీ క్యాచ్‌లను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. దీంతో ఢిల్లీ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ దినేశ్ కార్తీక్, డుమిని కొద్దిసేపు పోరాడారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 25 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఏ దశలోనూ ఢిల్లీ ఆటగాళ్లు క్రీజులో ఉండాలనే ఆసక్తి కనబర్చలేదు. 10 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా కౌల్టర్ నైల్ బ్యాటింగ్‌కు రాలేదు.
స్కోరు వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (బి) నదీమ్ 29; మెకల్లమ్ (సి) సబ్ పార్నెల్ (బి) ఉనాద్కట్ 9; రైనా (సి) విజయ్ (బి) నీషమ్ 56; డు ప్లెసిస్ (సి) విజయ్ (బి) షమీ 24; ధోని (సి) అగర్వాల్ (బి) ఉనాద్కట్ 32; జడేజా (సి) కార్తీక్ (బి) ఉనాద్కట్ 7; మన్హాస్ నాటౌట్ 13; అశ్విన్ (రనౌట్) 1; హిల్ఫెన్హాస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1-23; 2-77; 3-108; 4-141; 5-156; 6-162; 7-173.
బౌలింగ్: డుమిని 4-0-26-0; షమీ 4-0-45-1; నదీమ్ 3-0-29-1; ఉనాద్కట్ 4-0-32-3; నీశమ్ 4-0-29-1; విజయ్ 1-0-13-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) రైనా (బి) పాండే 2; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ శర్మ 11; దినేశ్ కార్తీక్ (బి) అశ్విన్ 21; తివారి (సి) డు ప్లెసిస్ (బి) పాండే 0; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) స్మిత్ 15; టేలర్ (సి) ధోని (బి) హిల్ఫెన్హాస్ 6; నీషమ్ (సి) రైనా (బి) జడేజా 22; నదీమ్ (సి)రైనా (బి) జడేజా 3; షమీ (సి) మెకల్లమ్ (బి) అశ్విన్ 1; ఉనాద్కట్ నాటౌట్ 1; కౌల్టర్ నైల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు (వైడ్లు 2) 2; మొత్తం (15.4 ఓవర్లలో ఆలౌట్) 84.
వికెట్ల పతనం: 1-8; 2-15; 3-17; 4-42; 5-50; 6-74; 7-80; 8-82; 9-84.
బౌలింగ్: పాండే 4-0-23-2; హిల్ఫెన్హాస్ 2-0-9-1; మోహిత్ శర్మ 3-0-17-1; స్మిత్ 2-0-14-1; జడేజా 2.4-0-18-2; అశ్విన్ 2-0-3-2.