సిద్ధమవుతున్న చైనా మూడోతరం క్షిపణులు
బీజింగ్: నేల నుంచి గాలిలోకి ప్రయోగించే మూడో తరం క్షిపణి వ్యవస్థను చైనా సిద్ధం చేస్తోంది. తమకు ముప్పుగా భావించే దక్షిణ కొరియాలో మోహరించిన అమెరికా అధునాతన క్షిపణి వ్యతిరేక వ్యవస్థను ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ ఈ క్షిపణులకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ కొత్తతరం క్షిపణులు తమ దాడిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయని చైనా వైమానిక అధికారి షెన్ జింకే తెలిపారు. ఇవి సుదూర, ఎత్తయిన లక్ష్యాలను ఛేదించగలవని చెప్పారు. వ్యూహాత్మక హెచ్చరికలు, గాల్లో దాడులు, విమాన, క్షిపణి వ్యతిరేక తదితర విభాగాలను ఉన్నతీకరిస్తామని ఆయన అన్నారు.
చైనా సైన్యం స్వదేశీ, నేలపై నుంచి పనిచేసే రక్షణ, క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను వాడుతుందని చైనా మార్నింగ్ పత్రిక వెల్లడించింది. ఉత్తర కొరియా అణు ఆయుధాల నుంచి రక్షణ కొరకే అమెరికా అభివృద్ధి చేసిన క్షిపణి వ్యతిరేక వ్యవస్థను మోహరించామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ వాదనలను చైనా రక్షణ శాఖ కొట్టిపారేసింది. మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకుండా అణు ఆయుధాలను ఎదుర్కోవడానికి దక్షిణ కొరియా చెబుతున్నవి కుంటి సాకులని ఆరోపించింది.