సిరీస్ విజయంపై భారత్ దృష్టి
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక అనంతరం దీనిని భారత ‘ఎ’ జట్టుగా బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ అభివర్ణించాడు. కానీ ఇప్పుడు ఆ ‘ఎ’ జట్టును ఎదుర్కోవడానికే ప్రత్యర్థి ఆపసోపాలు పడుతోంది. తొలి వన్డేలో టీమిండియా ఏకపక్ష విజయం అనంతరం ఇప్పుడు బంగ్లాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరో వైపు ఆడుతూ పాడుతూ శుభారంభం చేసిన రైనా సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డేలో తలపడనున్నాయి.
బౌలర్లకు మరో అవకాశం
గత మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప, రహానే , రైనా, రాయుడు రాణించడంతో భారత బ్యాటింగ్ విభాగం ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ భారత యువ బౌలర్లు కొంత మేరకే సఫలం కాగలిగారు. గాయంతో పూర్తి ఓవర్లు వేయలేకపోయిన మోహిత్ ఈ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కోసం తస్కీన్ అహ్మద్‌కు స్థానం ఇచ్చే అవకాశం ఉంది.
వర్షం ముప్పు!: రెండో వన్డేకు కూడా వాతావరణం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం కూడా ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.