మరిగే పప్పుచారును ముఖంపై పోసి..
ఢిల్లీ: కన్నతల్లిదండ్రులనే కనీస కనిరకం లేకుండా వృద్ధ దంపతులపై దాష్టీకానికి దిగాడో కొడుకు. భార్య సహకారంతో మరిగే పప్పుచారును ముసలోళ్ల ముఖంపై పోసి దారుణంగా హింసించాడు. దేశరాజధాని ఢిల్లీలో కలకలం రేపిన ఈ ఘటనపై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని పహాడ్ గంజ్ ప్రాంతానికి చెందిన శేష్ నాథ్ వర్మ(69), ఉర్మిళ(64) దంపతులు ఎలక్రికల్ వస్తువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడి నబీ కరీం ప్రాంతంలో మూడంతస్తుల ఇల్లు కట్టుకుని, గ్రౌండ్ ఫ్లోర్ లో దుకాణాన్ని నడుపుతున్నారు. వాళ్ల పెద్ద కొడుకు రవీందర్ సోని(38) కూడా అదే ఇంట్లో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇల్లు అమ్మే విషయమై తరచూ తండ్రితో గొడవపడే రవీందర్.. 2009నుంచి వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
దుకాణాన్ని తెరవనీయకుండా, తల్లిదండ్రుల్ని ఇంట్లోకి రానీయకుండా హింసించేవాడు. ఒకసారి మరిగే పప్పుచారును ముఖాలపై పోశాడు. ఇంకోసారి కిరోసిన్ కుమ్మరించి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కొడుకు, కోడళ్ల హింసను భరించలేక చివరికా వృద్ధులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవలే తుది తీర్పు వెల్లడించిన ఢిల్లీ కోర్టు.. రవీందర్, అతని భార్యల తీరును దారుణంగా తప్పుపట్టింది. తక్షణమే ఇంటిని ఖాళీచేయడంతోపాటు నెలకు రూ.1000 భృతి చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రవీందర్ మాత్రం స్థానిక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేపనిలో ఉన్నాడు. మూడంతస్తుల ఇల్లు తన డబ్బుతో కట్టిందేనని, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో వాళ్లపేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించానని చెబుతున్నాడు.