ట్రాన్స్జెండర్లు నడిపే జీ టాక్సీలు!
పేరుకు మనుషులే అయినా సమాజంలో వారంటే ఓ రకమైన భావన. సమాజంలోనే ఉన్నా.. వారిపై చిన్నచూపు, వివక్ష. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లు గౌరవంగా, స్వశక్తితో బతకడం కోసం కేరళ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించనుంది. కేరళలో మహిళల సాధికారిత కోసం ప్రవేశపెట్టిన 'షీ టాక్సీ' పథకం విజయవంతం కావడంతో.. దీని బాటలోనే హిజ్రాల కోసం 'జెండర్ టాక్సీ' పథకానికి శ్రీకారం చుట్టింది. టాక్సీ సర్వీసులను ఆపరేట్ చేసేది, వాటి యజమానులూ హిజ్రాలే. వారిపై సామాజిక వివక్షను రూపుమాపాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు.
కేరళ సామాజికన్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని జెండర్ పార్క్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. షీ టాక్సీ పథకం మహిళా ప్రయాణికులకు ఉద్దేశించినది కాగా జెండర్ టాక్సీలో అందరూ ప్రయాణించవచ్చు. అన్ని అనుకూలిస్తే వచ్చే మార్చి నాటికి జీ టాక్సీ క్యాబ్‌లు కేరళ రోడ్లపై దర్శనమిస్తాయి. హిజ్రాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, మెరుగైన జీవితం అందించాలనే లక్ష్యంతో ట్రాన్స్‌జెండర్ పాలసీని ప్రారంభించామని, ఈ పథకం అమలులో భాగంగా తొలి అడుగుగా జీ టాక్సీ ప్రాజెక్టును ప్రవేశపెట్టనున్నట్టు కేరళ సామజికన్యాయ శాఖ మంత్రి ఎంకే మునీర్ చెప్పారు.
జీ టాక్సీ ప్రాజెక్ట్ హిజ్రాలకు ఉపాధి కల్పించి, మెరుగైన జీవితం అందిస్తుందని జెండర్ పార్క్ సీఈవో డాక్టర్ పీటీఎమ్ సునీష్ చెప్పారు. 'జీ టాక్సీ వల్ల ట్రాన్స్జెండర్లకు ఆదాయం రావడమే గాక జనజీవన స్రవంతిలో కలసిపోవడానికి ఓ మంచి అవకాశం. జీ టాక్సీ సర్వీసుల్లో ప్రయాణించేవారు వారితో సంభాషించడం వల్ల, వారిపై తమ అభిప్రాయం మారుతుంది' అని సునీష్ అన్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ జెండర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ జీవనోపాధి కోసం షీ టాక్సీ తరహాలో ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సునీష్ చెప్పారు. షీ టాక్సీ సర్వీసుల వలే జీ టాక్సీ సర్వీసుల్లో తగిన భద్రత చర్యలు చేపడతారు.