కిడ్నీల్లో పొడవాలని ప్లాన్ చేశారు
సిడ్నీ: ఉగ్రవాద చర్యకు ప్లాన్ చేసిన ఇద్దరు యువకులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఒమర్ అల్ కుతోబి(25), మహమ్మద్ కియాద్(27)లు సిడ్నీలోని షియా ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడికి ప్లాన్ చేసి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో శుక్రవారం తుదితీర్పు వెలువడింది.
2015 ఫిబ్రవరిలో ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన రోజే.. అప్రమత్తమైన పోలీసులు కుతోబి, కియాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసాల్లో సోదాలు జరిపిన సందర్భంగా.. దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్న కత్తులు, ఇస్లామిక్ స్టేట్ జెండాతో పాటు వీడియోలు వెలుగు చూశాయని విచారణ అధికారులు వెల్లడించారు. ఈ వీడియోల్లో మనుషుల కిడ్నీలు, మెడపై దాడి చేసి చంపడానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నట్లు తెలిపారు. ఉగ్రకుట్రలో కుతోబి, కియాద్‌లు సమానంగా పాలుపంచుకున్నారని తీర్పు సందర్భంగా జస్టీస్ పీటర్ గార్లిండ్ పేర్కొన్నారు.