శిల్పారామానికి రూ.1.14 కోట్లు
హరిత కాకతీయ హోటల్‌కు కొత్త అందాలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో నిర్మించనున్న శిల్పారామం ప్రాజెక్ట్‌కు రూ. 1.14 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, తిరుపతితోపాటు వరంగల్‌లో శిల్పారామం నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం 2010లో అనుమతులు జారీ చేసింది. ఒక్కో శిల్పారామానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయిం చింది.
అయితే నాలుగేళ్లుగా వరంగల్ శిల్పారామానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇక్కడ నిర్మించే శిల్పారామానికి రూ.5 కోట్లు రావాల్సి ఉండగా... ఇప్పటివరకు రూ 1.25 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.10.08 లక్షలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 1.14 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన నిధులను సైతం త్వరితగతిన మంజూరు చేసి... శిల్పారామాన్ని సకాలంలో నిర్మించేలా ఇక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా శిల్ప కళా ఖండాలను ఏర్పాటు చేసేందుకు మరో తొమ్మిది లక్షల రూపాయలు అదనంగా మంజూరయ్యాయి.