ఈ దూకుడును పాక్, చైనాలపై చూపండి
నాగపూర్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ రాజ్యసభలో శుక్రవారం ఆవేశంగా ప్రసంగించడంపై శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే స్పందించారు. పాకిస్థాన్, చైనాలు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నప్పుడు ప్రధాని ఈ దూకుడును ప్రదర్శించరని ఎద్దేవా చేశారు. కానీ ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తారని, ఇదే దూకుడును చైనా, పాక్‌లపై ఎందుకు ప్రదర్శించరోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామ్‌టెక్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ తనదైన శైలిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకోవడంపై ప్రధాని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత అరుణ్ జైట్లీకి, ప్రధానికి మధ్య వాగ్యుద్ధం సాగిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ముకుల్ వాస్నిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌టెక్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించినందున భాగస్వామ్యపక్షాలైన బీజేపీ, ఆర్పీఐలలో ఎవరో ఒకరికి ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఉద్ధవ్ స్పష్టం చేశారు. ఇక సీట్ల పంపకాలపై వస్తున్న వార్తల్లో నిజంలేదని, ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నారు. కల్యాణ్ లోక్‌సభ స్థానానికి మనోహర్ జోషి పోటీ చేస్తారని, దాదర్‌ను ఆర్పీఐకి కేటాయిస్తున్నారని, బీజేపీ కూడా శివసేన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తోందంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనన్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయమై ఇప్పటిదాకా ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక విదర్భ గురించి మాట్లాడుతూ... స్థానిక నేతలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారన్నారు.