హోరెత్తిన శోభాయాత్ర
హిందూపురం అర్బన్ : హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసురక్షసమితి ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర చేపట్టారు. సుగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి హనుమాన్ విగ్రహాన్ని వాహనంపై కొలువుదీర్చి వేలాదిమంది భక్తులు రామదండు ర్యాలీగా కదిలారు. ఆలయం నుంచి జై శ్రీరామ్, జైబోలో హనుమాన్ అంటూ కాషాయ పతాకాలు పట్టుకుని ర్యాలీగా తరలివెళ్లారు. హిందూసురక్షసమితి అధ్యక్షులు రవిచంద్ర, శ్రీనివాసులు, బాబు, విద్యాసాగర్ నేతృత్వంలో ర్యాలీ భారీగా సాగింది. ర్యాలీలో యువకులు జై హనుమాన్ అంటూ కేరింతలు కొడుతూ కదిలారు. జాంబవంతుడు, హనుమంతుడు వేషధారణలో యువకులు అలరించారు. అలాగే కొల్లకుంట ఆంజనేయస్వామి, సూరప్పకట్ట వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సమితి సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.