షోలేను రీమేక్ చేయడం తప్పేమో: అమితాబ్
షోలే లాంటి అద్భుతమైన సినిమాను అసలు రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పేనేమోనని అసలు, రీమేక్.. రెండు సినిమాల్లోనూ నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. 1975లో రమేష్ సిప్పీ దర్శకత్వంలో అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన షోలే సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ రికార్డులనే షోలే అప్పట్లో తుడిచిపెట్టేసింది. ఆ సినిమాకు రేపటితో 40 ఏళ్లు. ఇదే సినిమాను రాంగోపాల్ వర్మ 'ఆగ్' అనే పేరుతో తర్వాత రీమేక్ చేశాడు. అందులో అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, అజయ్ దేవ్గణ్, ప్రశాంత్ రాజ్ సచ్దేవ్, సుస్మితా సేన్ తదితరులు నటించారు.
ఈ సినిమాపై విమర్శకులు దుమ్మెత్తి పోయగా.. బాక్సాఫీసు వద్ద కూడా అడ్డంగా బోల్తాపడింది. ఈ ప్రయోగం గురించి ఏమంటారని బిగ్ బీని అడిగితే.. ఆ ప్రశ్న రాంగోపాల్ వర్మను అడగాలన్నారు. ఏ సినిమా తీసినా తాను అందులో నటిస్తానని, అయితే అది భారీ విజయం సాధించినా, అట్టర్ ఫ్లాప్ అయినా దానికి దర్శకుడే బాధ్యుడని ఆయన చెప్పారు. తాను తప్పు చేశానని చెప్పబోనని, చాలా నిజాయితీగా ఆ సినిమాలో పనిచేశానని, కానీ అసలు రీమేక్ చేయాలనుకోవడమే తప్పేమోనని అమితాబ్ వ్యాఖ్యానించారు.