డిప్రెషన్ లో గన్ తో కాల్చుకున్న యువతి..
ముజఫర్ నగర్: కుటుంబ కలహాలు ఓ యువతిని మానసిక వేదనకు గురిచేయాయి. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఆత్మహత్యే తనకు శరణ్యమని భావించింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖరాడ్ గ్రామంలో చౌదరి మన్సబ్ అలీ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఆయన కూతురు రేష్మ చౌదరి(18). గత కొన్ని రోజులుగా వారి కుటుంబం కొన్ని సమస్యల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె మానసిక వేదనకు గురైంది.
గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడింది. రేష్మ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. అయితే ఆమెది ఆత్మహత్యా.. లేక హత్యా.? అనేది ఇంకా తేలలేదని అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.